ఒకేచోట అభివృద్ధితో సీమాంధ్రకు దారుణ నష్టం

19 Dec, 2019 03:57 IST|Sakshi

వికేంద్రీకరణను స్వాగతిస్తున్నాం

బీజేపీ ఎంపీ జీవీఎల్‌

సాక్షి, న్యూఢిల్లీ: అధికార వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని, సమర్థిస్తున్నామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ‘గతంలో హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన అభివృద్ధి వల్లే సీమాంధ్ర  దారుణంగా నష్టపోయింది. ఇప్పుడు రాష్ట్ర అవసరాలే ప్రాతిపదికగా వికేంద్రీకరణ ఉండాలి. ఒకచోటే కేంద్రీకరిస్తే అన్ని మౌలిక సదుపాయాలు అక్కడే కల్పించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. రాజధానిపై నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీలో రాజకీయ నాయకులు ఎవరూ లేరని, కమిటీ వికేంద్రీకరణకు సిఫారసు చేసిందన్నారు. సచివాలయం కూడా ఒకేచోట ఉండాల్సిన అవసరం లేదని కమిటీ చెప్పిందన్నారు. జీవీఎల్‌ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘పలు దేశాల్లో, రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ కూడా చాలా సందర్భాల్లో డిమాండ్‌ చేసింది. గత ప్రభుత్వం ఆ డిమాండ్లను విస్మరించింది’ అని చెప్పారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

కేంద్రం నిర్దేశించే పరిస్థితి లేదు
‘రాజధానిని రాష్ట్రం ఎంచుకున్న చోట మౌలిక వసతుల కోసం కేంద్రం సాయం చేస్తుందని పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. ఇంతకు మించి కేంద్ర ప్రభుత్వ పరిధి ఏమీ లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రాజధాని ఎక్కడ ఉండాలో కేంద్రం నిర్దేశించే పరిస్థితి లేదు. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం బేఖాతరు చేసింది. కమిటీ చేసిన కొన్ని ప్రతిపాదనలను నేడు సీఎం జగన్‌ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.

ఒకవైపు ఆక్వా.. మరోవైపు ఖనిజ సంపద
‘వికేంద్రీకరణను బీజేపీ స్వాగతిస్తుంది. ఏపీలో ఆక్వా కల్చర్‌ ఒకవైపు ఉంటే గనులు, ఖనిజాలు మరోవైపు ఉన్నాయి. రాజధానిలో ప్రజా ప్రయోజన కోణం ఉండాలే కానీ రాజకీయ కోణం, సామాజిక కోణం ఉండకూడదు. అలాంటి చర్యను మేం సమర్థించం. రాజధాని ప్రాంత రైతుల్లో ఆందోళన ఉంది. వారికి నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అమరావతిని అసెంబ్లీకే పరిమితం చేయకుండా చూడాలి’ అని సూచించారు.

మరిన్ని వార్తలు