‘రాఫెల్‌పై రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి’

14 Dec, 2018 16:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్‌ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పడంతో ఎన్డీయే సర్కారుకు ఊరట లభించింది. ఈ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీని టార్గెట్‌ చేస్తున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఢిల్లీలో మీడియాతో మట్లాడతూ... కేంద్ర ప్రభుత్వంపై, రక్షణ వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలోనే 2002లో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. (రాఫెల్‌ కేసులో మోదీ సర్కార్‌కు ఊరట)

కానీ, 2015 వరకు ఆ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. అప్పటికే శత్రుదేశాలు పలు యుద్ద విమానాలు కొనుగోలు చేసి మనకన్నా పటిష్ట స్థితిలో ఉన్నాయనీ, రాఫెల్‌ డీల్‌ను కాంగ్రెస్‌ కావాలనే ఆలస్యం చేసిందిని జీవీఎల్‌ ఆరోపించారు. రాబర్ట్‌ వాద్రా, ఆయన మిత్రులకు కమీషన్లు రాలేదనే అక్కసుతోనే రాహుల్‌ కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. యుద్ద విమానాల కొనుగోలును ఆలస్యం చేసి దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా కాంగ్రెస్‌ వ్యవహరించిందని మండిపడ్డారు. మధ్యవర్తులు లేకుండా విమనాలు కొనుగోలు చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో చేరినందుకు చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు గట్టి దెబ్బకొట్టారనీ, ఆయనకు మరోసారి దెబ్బ పడడం ఖాయమని జీవీఎల్‌ జోస్యం చెప్పారు. రాఫెల్‌ డీల్‌పై చర్చించేందుకు బీజీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో స్పష్టం చేశారని జీవీఎల్‌ వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు