‘సీఎం విమానం ఎక్కేలోపు.. క్లారిటీ ఇవ్వాలి’

22 Sep, 2018 19:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ఏ మీటింగ్‌ కోసం వెళుతున్నారో క్లారిటీగా చెప్పాలని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవిఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు అమెరికా టూర్‌పై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వారు పెడుతున్న సమావేశంకు వెళ్తూ ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్తున్నామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐరాసలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో వారు పంపిన ఇన్విటేషన్‌ ఏమిటో బయట పెట్టాలన్నారు. చంద్రబాబు విమానం ఎక్కేలోపు అమెరికా టూర్‌పై స్పష్టతనివ్వాలన్నారు. ఎకనామిక్‌ ఫోరమ్‌ వారు పెడుతున్న సమావేశానికి ఐక్యరాజ్యసమితికి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. 

ఏపీలో బూటకపు పాలన 
ఏపీలో టీడీపీ ప్రభుత్వం బూటకపు పాలన సాగిస్తోందని జీవిఎల్‌ మండిపడ్డారు. రామాయపట్నం పోర్టును మైనర్‌ పోర్టుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందని ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలు, ప్రజలు వ్యతిరేకించేసరికి టీడీపీ నాయకులే పోర్టు దగ్గరికి వెళ్లి డ్రామాలు ఆడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కాగ్‌ ఇచ్చిన నివేదికపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అవినీతిని బయట పెడితే వారిని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలనే గోదావరి పుష్కరాల్లో మరణాలు సంభవించాయని ఆరోపించారు. చంద్రబాబు తను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకే మీడియా, భక్తుల మీదకు తప్పును నెట్టేస్తున్నారని జీవిఎల్‌ విమర్శించారు.  

   

మరిన్ని వార్తలు