‘రేవంత్‌, రమేష్‌లు చంద్రబాబు బినామీలు’

12 Oct, 2018 12:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మంత్రి లోకేష్‌ వ్యాఖ్యలతో సీఎం రమేష్‌ చంద్రబాబు బినామీ అని తేలిపోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి లోకేష్‌  బినామీ ఐటీ కంపెనీలు పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను, భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రాధమిక ఆధారాలు లేకుండా ఐటీ శాఖ సోదాలు జరపదు, సమాచారం ఉంది కనుకనే దాడులు నిర్వహిస్తుందన్నారు.

ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా కక్ష సాధింపు చర్యలు అంటే ఎలా అని ప్రశ్నించారు. తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇతర పార్టీలపై ఐటీ సోదాలు జరిగితే భేష్‌ అన్న టీడీపీ నేతలు తమపై జరిగితే మాత్రం భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి, సీఎం రమేష్‌లు చంద్రబాబు బినామీలని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని, అదంతా అవినీతి సొమ్మేనని విమర్శించారు. 

దొంగ దీక్షలకు ఎవరూ భయపడరు 
ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేష్‌ చేసే దొంగ దీక్షలకు ఎవరూ భయపడరని జీవీఎల్‌ అన్నారు. దీక్ష చేసినందుకే  కక్ష కట్టి కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోదనడంలో వాస్తవం లేదన్నారు. అక్రమార్జనపై వచ్చిన ప్రశ్నలకు సీఎం రమేష్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్టాంట్‌పై ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చలు జరిపామని, ఆయన సానుకూలంగా స్పందించారని జీవీఎల్‌ చెప్పారు. మేకాన్‌ సంస్థ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ( చదవండి : సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు)

మరిన్ని వార్తలు