‘లోకేశ్‌తో చాలెంజ్‌ అన్నారు.. మళ్లీ పత్తాలేరు’

9 Nov, 2018 13:47 IST|Sakshi
జీవీఎల్‌ నరసింహారావు

బీజేపీ ఎంపీ జీవిఎల్‌ నరసింహారావు

సాక్షి, విజయవాడ : రాష్ట్ర అభివృద్ధిపై మంత్రి లోకేశ్‌తో చర్చకు సిద్ధమా? అని చాలెంజ్‌ చేసిన టీడీపీ నాయకులు పత్తాలేరని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఎద్దేవా చేశారు. ఓ ముఖ్యమంత్రి కుమారుడిగా తప్ప లోకేష్‌ స్థాయి ఏంటని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల్లోని 11 విద్యాసంస్థలను కేంద్రం చొరవతో రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. పదేళ్ల కాల పరిమితి ఉన్నా నాలుగేళ్లలోనే కేంద్రం చేసి చూపించింది. టీడీపీ,‌కాంగ్రెస్ పార్టీలు రాయలసీమపై వివక్ష చూపాయి. కేంద్రీయ నట విశ్వ విద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేశాం. ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి చూపించే శ్రద్ద రాష్ట్రాభివృద్ధిపై చూపించడం లేదు. 

బీజేపీ నేతలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు..
టీడీపీ నాయకులు చర్చల పేరుతో రచ్చ‌చేస్తున్నారు. చర్చలకు పిలిచి సమాధానాలు చెప్పలేక పోలీసుల చాటున పిరికిపందల్లా పారిపోతున్నారు.  మాజీ మంత్రి మాణిక్యాలరావు సవాల్‌కు తెదేపా వాళ్లు ఎందుకు భయపడ్డారో చెప్పాలి. బీజేపీ నేతలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. మాణిక్యాలరావును పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకోవడం అప్రజాస్వామికం. జాతీయ మీడియా‌ ముందు టీడీపీ ప్రభుత్వ అరాచకాలన్నీ బయటపెడతాం. చంద్రబాబు ప్రజల సొమ్ముతో విలాస ప్రయాణాలు చేస్తున్నారు.

బెంగళూరు, ఢిల్లీ పర్యటనలు, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పార్టీ ఫండ్ ఖర్చు పెట్టుకోవాలి తప్ప ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు? రాజకీయ కార్యక్రమాలకు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తే అధికారులను కోర్టుకు ఎక్కిస్తాం. విశాఖలో భూ కబ్జాలపై సిట్  నివేదిక ఇస్తే తూతూ మంత్రంగా క్యాబినెట్ ఆమోదించడం సిగ్గుచేటు. భూ కబ్జాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు వస్తే వారిని తప్పించేవిధంగా కుట్రలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం  ప్రాజెక్టుల పేరుతో నిర్వహించే భూ దందాలపై ఉద్యమాలు చేపడతాం. 18న తిరుపతిలో బీజేపీ కోర్‌కమిటీ మీటింగ్ పెట్టి.. రాయలసీమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు