గ్వాలియర్‌ ‘మహారాజు’ ఎవరో!

4 May, 2019 15:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘2014లోలాగా ఇప్పుడు నరేంద్ర మోదీ హవా లేదు. ఆయన నాడిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ లేదు. రైతుల్ని అయితే పూర్తిగా విస్మరించారు. మోదీ అయినా, రాహుల్‌ అయినా మాకు ఒరిగేది ఏమీ ఉండదు. ప్రస్తుతం మాకు అభ్యర్థే ముఖ్యం. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్వాలియర్‌ మేయర్‌ వివేక్‌ షెజావాల్కర్‌ ఏ నాడు మా వూరును సందర్శించలేదు. అదే కాంగ్రెస్‌ అభ్యర్థి అదే అశోక్‌ సింగ్‌ మా ఊరుకు 15 సార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా రైతుల యోగ క్షేమాలు అడుగుతారు. ఆయన పట్ల మాకు సానుభూతి కూడా ఉంది.

2007లో జరిగిన ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యశోధర రాజె సింధియా చేతుల్లో అశోక్‌ సింగ్‌ ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మోదీ హవా కారణంగా బీజేపీ అభ్యర్థి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేతుల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోవడానికి రాజూ లేడు. మోదీ ప్రభావమూ లేదు. ఆయన్నే గెలుస్తారు. ఆయనకే ఓటు వేస్తాం’ అని గ్వాలియర్‌లోని సముదాన్‌ గ్రామంలో నీడపట్టున ముచ్చటిస్తున్న రైతులను మీడియా కదిలించగా వారీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓట్లు వేశామని, ఈసారి కూడా ఆ పార్టీకే ఓటు వేస్తామని కొందరు రైతులు చెప్పారు. గ్వాలియర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పరదిలో ఏడు అసెంబ్లీ సెంగ్మెంట్లు ఉండగా, వాటిలో ఆరింట కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 231 సీట్లు ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 114 సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. అప్పటి ఎగ్జిట్‌ పోల్‌లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేశామని చెప్పిన రైతుల్లో ఎక్కువ మంది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని చెప్పారు. ఇప్పుడు వారి వైఖరి మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైతుల రుణాల మాఫీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేయడం కొంత మార్పునకు కారణం. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రానికి నిధుల కొరత ఉండదని ఒకరిద్దరు రైతులు అభిప్రాయపడ్డారు. గ్వాలియర్‌ నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులతోపాటు దళితుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. వారిలో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. మే 12వ తేదీన ఇక్కడ పోలింగ్‌ జరుగుతుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు