బతుకమ్మ 'సిరి'

21 Mar, 2019 11:42 IST|Sakshi

సిరిసిల్ల నేతన్నలకు  ‘బతుకమ్మ’ దీవెన..

మగ్గాలకు మనుగడ.. చేతినిండా పని నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు

రూ.కోట్లలో తయారీ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు

 ‘బతుకమ్మ’ దీవెన.. మగ్గాలకు మనుగడ.. చేతినిండా పని

నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు రూ.కోట్లలో తయారీ ఆర్డర్లు

సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌కు చెందిన నేత కార్మికుడు రాజయ్య (57) 12 సాంచాలపై వస్త్రోత్పత్తి చేస్తాడు. మరమగ్గాలపై పాలిస్టర్‌ బట్ట నేయడం ద్వారా నెలకు రూ.8 వేల నుంచి రూ.పది వేలు వస్తే ఇదే సాంచాలపై బతుకమ్మ చీరలను నేయడం వల్ల నెలకు రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకూ వస్తుంది. నేత కార్మికుల పింఛన్‌ నెలకు రూ.1000 వస్తుంది. అంత్యోదయ కార్డు ద్వారా రూపాయికి కిలో చొప్పున నెలకు 35 కిలోల బియ్యం వస్తున్నాయి. కార్మికురాలు రాజయ్య భార్య లత నెలకు రూ.2,000 సంపాదిస్తోంది.కొడుకు రాహుల్‌ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. బొటాబొటీ ఆదాయం, పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబ కలహాలు, వెరసి బలవన్మరణాలు.. ఇవి ఈ ప్రాంతంలో నిత్యకృత్యం కాగా, ఇం దుకు కార్గిల్‌ లేక్‌ (చెరువు) సాక్షిగా సిరిసిల్ల ఉరిసిల్ల అయింది. కుటుంబంలో ఐదుగురు ఒకేసారి ఒకేరో జు ఆత్మహత్య చేసుకొన్న విషాదాలూ ఉన్నాయి. ఇప్పుడా గతం గాయాలు మానుతున్నాయి. కష్టాలు, కన్నీళ్లను అధిగమించి ఆత్మవిశ్వాసంతో నేతన్నలు అడుగులు వేస్తున్నారు.

వెలుగులు నింపిన బతుకమ్మ...
నేతన్నల ఉపాధి లక్ష్యంతో  ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇవ్వడం నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపింది. సిరిసిల్లలో ఆరు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలిస్టర్‌ బట్ట (తెల్లది)ను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.1.50 మాత్రమే ఇస్తుంటే, బతుకమ్మ చీరలకు అవసరమైన ఒక్కో మీటరు బట్టను నేస్తే రూ.4.25 చెల్లిస్తున్నారు. ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించారు. మరో వైపు రాజీవ్‌ విద్యామిషన్‌(ఆర్వీఎం) లో కోటి 30 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు కలిపి మొత్తంగా సిరిసిల్ల నేత పరిశ్రమకు ఇప్పుడు రూ.360 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. గత ఫిబ్రవరిలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లను జౌళిశాఖ సిరిసిల్ల నేతన్నలకు అందించింది.  సిరిసిల్లలోని 121 మ్యాక్స్‌ సంఘాలకు, 64 చిన్నతరహా పరిశ్రమలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారు. దీంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు నూలు దిగుమతి చేసి జౌళిశాఖ సూచన మేరకు కార్మికులకు చేతినిండా పని కల్పిస్తూ బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు.

నేతన్నకు చేతినిండా పని...
గత 2017లోనే తొలిసారి రూ.220 కోట్ల విలువైన బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చినా సకాలంలో చీరలు అందించడం సాధ్యం కాలేదు దీంతో సూరత్‌ నుంచి చీరలు కొన్నారు. అయితే సూరత్‌ చీరల్లో నాణ్యత లేదనే ఆరోపణలతో  2018లో రూ.290 కోట్ల ఆర్డర్లు మే నెలలో ఇవ్వగా నూలు దిగుమతి చేసుకుని వస్త్రోత్పత్తి ప్రారంభించేసరికి రెండు నెలలు ఆలస్యమై జూలైలో చీరల ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో బతుకమ్మ పండుగకు చీరలు అందించేందుకు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏడు నెలల ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లను  అందించింది. దీంతో ఆరు నెలల పాటు సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని లభిస్తుంది.  కోటి చీరల ఉత్పత్తి లక్ష్యంతో సిరిసిల్లలో ఆర్డర్లు ఇచ్చారు. బతుకమ్మ పండుగకు ముందే తెలంగాణ ఆడపడుచులకు అందించే బతుకమ్మ చీరలు నాణ్యత, నవ్యతతో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

పొదుపు నేర్పుతున్న ‘త్రిప్ట్‌’ పథకం..
దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో త్రిప్ట్‌ పథకం అమలవుతోంది. నేత కార్మికుడు తన సంపాదన లో కనీసం 8 శాతం బ్యాంకులో జమచేస్తే అంతే మొ త్తం ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఉదాహరణకు నెల కు గరిష్టంగా రూ.1000 జమ చేస్తే జౌళిశాఖ మరో వెయ్యి కార్మికుడి ఖాతాలో జమ చేస్తుంది. మూడేళ్ల తరువాత ఆ సొమ్మును వడ్డీతో సహా కార్మికుడు తీసుకుని వినియోగించుకోవచ్చు. ఇందులో చేరేందుకు నేత కార్మికులు, డయింగ్, వార్పిన్, సైజింగ్, జాపర్లు, వైపని కార్మికులు అర్హులు. మరోవైపు జియోట్యాగింగ్‌ ద్వారా సిరిసిల్లలో 25,578 మరమగ్గాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి ఆధారంగా కార్మికుల వివరాలను నమోదు చేశారు. కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రం ఆధారంగా పది శాతం నూలు రాయితీని నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు జౌళిశాఖ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో  పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన తంగళ్లపల్లి, చంద్రంపేట, జ్యోతినగర్, రాజీవ్‌నగర్, పద్మనగర్‌ ప్రాంతాల్లోని నేత కార్మికులకు చేతినిండా పనితో పాటు మెరుగైన వేతనాలు అందుతున్నాయి.– వూరడి మల్లికార్జున్,సాక్షి– సిరిసిల్ల

ఇంటర్‌ చదివిన ద్యావనపెల్లి దేవేందర్‌ (23) తండ్రి నేత కార్మికుడైన రాములు పదేళ్ల కిందటే గుండెపోటుతో మరణించాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా దేవేందర్‌ చదువు మానేసి మరమగ్గాల మధ్య కండెలు చుడుతున్నాడు. ఇతనికి నెలకు రూ.10 వేల జీతం వస్తుంది. బీడీ కార్మికురాలు తల్లి బాలనర్సవ్వకు పింఛన్‌ నెలకు రూ.1,000 వస్తుంది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో దేవేందర్‌ ఆదాయం పెరిగి తల్లి బాగోగులు చూసుకోగలుగుతున్నాడు. సిరిసిల్లలోని 25వేల మంది మరమగ్గాల (పవర్‌లూమ్స్‌) కార్మికుల జీవితాల్లో వచ్చిన మెరుగైన మార్పులకు ఈ ఇద్దరు నేతన్నలు ఓ ఉదాహరణ.

ప్రభుత్వ ఆర్డర్లే బతికించాయి
ప్రభుత్వ బతుకమ్మ చీరల, ఆర్వీఎం వంటి ఆర్డర్లు సిరిసిల్ల నేత పరిశ్రమను బతికించాయి. లేకుంటే సాంచాలు అమ్ముకునే పరిస్థితి.ఈ ఆర్డర్లతో కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్‌ నేతన్నలకు ఎంతో మేలుచేశారు.– ఆడెపు భాస్కర్, పాలిస్టర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి.

నేతన్న ఆలోచనల్లోమంచి మార్పు
దశాబ్దకాలంగా నేత కార్మికులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాను. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో నేతన్నల్లో చాలా మార్పు వచ్చింది.కుటుంబ కలహాలు తగ్గాయి. పొదుపు అలవాటై వ్యసనాలకు దూరంగా ఉంటున్నారు.    – కె.పున్నంచందర్, సైకాలజిస్ట్‌

మరిన్ని వార్తలు