‘సోనియా కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాలి’

5 Mar, 2020 16:06 IST|Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్రీయ లోక్‌తంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పీ) ఎంపీ హనుమాన్ బెనివాల్‌ గురువారం లోక్‌సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమె కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరారు. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ గురువారం లోక్‌సభలో ప్రకటన చేశారు. ఇప్పటివరకు భారత్‌లో 29 మందికి సోకిందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత పలువురు ఎంపీలు మాట్లాడుతూ కరోనా వైరస్‌ సంబంధించి కేంద్రానికి పలు సూచనలు చేశారు. ఈ సమయంలో మాట్లాడిన బెనివాల్‌.. సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ‌, ప్రియాంక గాంధీలకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలినవారిలో ఎక్కువ మంది సోనియా పుట్టినిల్లు ఇటలీ నుంచి వచ్చిన వారేనని అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేకు వారికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. 

అయితే బెనివాల్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకువచ్చి బెనివాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెనివాల్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. పేపర్లను చింపివేయడంతోపాటు.. కొన్నింటిని స్పీకర్‌ టేబుల్‌పైకి విసిరారు. దీంతో స్పీకర్‌ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ సభను వాయిదా వేశారు. రాజస్తాన్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌తంత్రిక్‌ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు