చౌకీదార్‌ కోసం నేపాల్‌కు వెళ్తా : హార్దిక్‌ పటేల్‌

23 Apr, 2019 16:00 IST|Sakshi

అహ్మదాబాద్‌ : సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు చేపట్టిన మై బీ చౌకీదార్‌ ఉద్యమంపై కాంగ్రెస్‌ నేత హార్దిక్‌ పటేల్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  దేశాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రధాన మంత్రి మాత్రమే ఉండాలని కోరుకుంటానే తప్ప చౌకీదార్లను కాదని ఆయన ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు దేశ వ్యాప్తంగా మూడో విడత పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో హార్దిక్‌ పటేల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ నాకు చౌకీదార్‌(వాచ్‌మెన్‌) అవసరం ఉంటే... నేను నేపాల్‌కు వెళ్తాను. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే, యువతకు విద్య, ఉపాధి కల్పించి దేశాన్ని దృఢంగా మార్చే ప్రధాని ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుతం నాకు కావాల్సింది ప్రధాని మాత్రమే. చౌకీదార్‌ కాదు అంటూ హార్దిక్‌ పటేల్‌ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.

ఆఖరికి ఆమె కూడా పోటీ చేస్తుంది.. నేనే..
‘ నేను అస్సలు సంతోషంగా లేను. ఆఖరికి సాధ్వీ ప్రగ్యా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను మాత్రం అనర్హుడినయ్యాను. ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తోంది. అసలు ఇలా జరగాల్సింది కాదు అంటూ హార్దిక్‌ పటేల్‌ అసహనం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మాలేగావ్‌ పేలుళ్ల కేసుతో సంబంధం ఉన్న సాధ్విని బీజేపీ భోపాల్‌లో పోటీకి దింపడాన్ని విమర్శించారు. తమను మోసం చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన గుజరాత్‌లో బీజేపీ ఇప్పుడు 10 నుంచి 12 సీట్లు మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు.

కాగా 2015లో పటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్‌ ప్రోద్బలం ఉందంటూ నమోదైన కేసులో విస్‌నగర్‌ సెషన్స్‌ కోర్టు హార్దిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.  హార్దిక్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్‌.. జామ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో హార్ధిక్‌ ఆశలు ఆవిరయ్యాయి.

మరిన్ని వార్తలు