హార్దిక్‌ చెంప చెళ్లుమంది

20 Apr, 2019 03:30 IST|Sakshi

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ నేత, పటీదార్‌ ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లాలో ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. ఆ వ్యక్తిని గుజరాత్‌కు చెందిన తరుణ్‌ గజ్జర్‌గా గుర్తించారు. దాడి తర్వాత కాంగ్రెస్‌ నేతలు, పటేల్‌ మద్దతుదారులు అతన్ని చితకబాదగా, తీవ్ర గాయాలపాలైన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘బీజేపీ నాకు హాని తలపెట్టాలని చూస్తోంది. నాపై దాడికి బీజేపీ చాలామందిని నియమించింది.

అసలు ఆ వ్యక్తి నాపై ఎందుకు దాడి చేశాడో తెలీదు. అతను కచ్చితంగా బీజేపీకి చెందినవాడే. ఒక వేళ అతను తుపాకీ గానీ వెంట తెచ్చి ఉంటే నేను చనిపోయేవాన్ని’అని హార్దిక్‌ అన్నారు. బీజేపీ నేతలు ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ సానుభూతి పొందాలనే కొత్త నాటకానికి తెరలేపిందని అన్నారు.  హార్దిక్‌పై దాడికి గల కారణాలను గజ్జర్‌ ఆస్పత్రి బెడ్‌ మీద నుంచే మీడియాకు వెల్లడించాడు. ‘2015లో పటేల్‌ ఉద్యమ సందర్భంగా అల్లర్లు జరిగినప్పుడు నా భార్య, నా బిడ్డ అతని వల్ల ఇబ్బంది పడ్డారు. అందుకే అప్పటినుంచి ఆయనంటే నాకు కోపం’ అని గజ్జర్‌ అన్నాడు.

మరిన్ని వార్తలు