ఉమ్మడి మెదక్‌లో అన్నీ గెలుస్తాం: హరీశ్‌

21 Sep, 2018 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచామని, ఈసారి అన్నీ గెలుస్తామని, రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నేతృత్వంలో ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు రమణారావు, జమాలుద్దీన్, రాంచందర్, గడ్డం దశరథ, ఆంజనేయులుగౌడ్, నాయిని రమేశ్, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు తదితరులు గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ను వీడి బంగారు తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. ఈ రెండు నెలలు పార్టీ కోసం గట్టిగా కష్టపడాలని కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన వారిని కోరారు. తర్వాత తాము ఐదేళ్ల పాటు ప్రజలు, కార్యకర్తల కోసం పని చేస్తామని చెప్పారు.

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. అధికార పీఠం దక్కదన్న దుగ్ధతో ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తున్న కాంగ్రెస్‌ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. రాజకీయాలే తప్ప ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ ఎన్నడూ పట్టించుకోలేదని.. అలాంటి నేతలు మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని, వారి మోసాలను ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు.

కాంగ్రెస్‌కు ఎన్నికల భయం: తలసాని
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలకు ఎన్నికల భయం పట్టుకుందని... అందుకే ఓట్ల తొలగింపు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఓటరు జాబితాలో సవరణలకు ఈ నెల 25 వరకు గడువు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఎన్నికల కమిషన్‌ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణలపై కాంగ్రెస్‌ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

వారి పరిస్థితిని చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా ఇప్పుడు ఆచరణ సాధ్యం కానీ హామీలిస్తోందని మండిపడ్డారు. అమిత్‌ షా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఈ సారి బీజేపీకి రెండు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అమావాస్యకో, పున్నమికో హైదరాబాద్‌ వచ్చే ఆజాద్‌ లాంటి నేతలకు టీఆర్‌ఎస్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సనత్‌నగర్‌ నుంచి ప్రచారం ప్రారంభిస్తే స్వాగతిస్తానని, ఆయన ప్రచారం వల్ల తనకు లాభమేనని స్పష్టం చేశారు.  

కాంగ్రెస్‌ నేతలు కోర్టు పక్షులు
టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు కోర్టు పక్షుల్లా మారారని ఎంపీ బి.వినోద్‌కుమార్‌ విమర్శిం చారు. నాలుగేళ్లుగా సాగు నీటి ప్రాజెక్టులకు కోర్టుల్లో పిటిషన్లు వేసి అడ్డుపడి, ఇప్పుడు ఎన్నికల విషయంలోనూ అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు ఈద శంకర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌లతో కలసి వినోద్‌ గురువారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ వారు ఎవరి ప్రయోజనం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్నారని ప్రశ్నిం చారు.

ముందస్తు ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని విమర్శిం చారు. ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతుంటే.. మరోవైపు ఆ పార్టీ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఎన్నికలకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ‘కేసీఆర్‌ను ప్రజల మధ్య ఎదుర్కొలేక కాంగ్రెస్‌ నేతలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు కుటిల రాజకీయం చేస్తున్నారు.

అభివృద్ధిని అడ్డుకుని ప్రజల్లో కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ కలలు కంటోంది. ఇప్పుడు వచ్చేవి 3 నెలల ముందస్తు ఎన్నికలే. ఓటరు జాబితాలో 70 లక్షల మంది పేర్లు తొలగించారని శశిధర్‌రెడ్డి కోర్టులో పిటిషన్‌ వేశారు. జాబితాల్లో పేర్లు లేకుంటే కాంగ్రెస్‌ పిలుపునిచ్చి మళ్లీ నమోదు చేయించవచ్చు కదా. అసెంబ్లీ రద్దు తర్వాత ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాజ్యాంగం చెబుతోంది. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కొందరు రాజ్యాంగం తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు’ అని వినోద్‌ వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు