అభివృద్ధిలోనే హరీశ్‌తో పోటీ

5 Oct, 2018 01:55 IST|Sakshi
గురువారం హైదరాబాద్‌లో సిరిసిల్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో కేటీఆర్‌ తదితరులు

సిరిసిల్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌

హరీశ్, నేను అన్నదమ్ముల్లా కలసి పెరిగాం

బావ, బావమరుదులు ఒకే కేబినెట్‌లో ఉండటం దేశంలోనే తొలిసారేమో

ఆయన కాలంతో పోటీపడి ‘కాళేశ్వరాన్ని’ పరిగెత్తిస్తున్నారని కితాబు

సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామన్న హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఒక్క అభివృద్ధి విషయంలో తప్ప మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు, తనకు మధ్య ఎలాంటి పోటీ లేదని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. హరీశ్‌రావు, తాను సొంత అన్నదమ్ముల్లా కలసి పెరిగామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో గెలుపు విషయంలో సూచనలు చేసేందుకు వచ్చిన హరీశ్‌రావుకు ధన్యవాదాలు. హరీశ్‌రావు కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును పరిగెత్తిస్తున్నారు.

ఈ ప్రాజెక్టుతో మన (సిరిసిల్ల జిల్లా) బతుకు ముడిపడి ఉంది. కాళేశ్వరం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులతో సిరిసిల్ల జిల్లాలోని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. హరీశ్‌రావు వల్లే మనకు నీళ్లు వస్తున్నాయి. సార్‌ (హరీశ్‌రావు) చెప్పిండని మీరు ఉబ్బిపోయేరు. మెజారిటీ విషయంలో మన లక్ష్యం సిద్దిపేట కాదు. మనం శాయశక్తులా కష్టపడదాం. మా ఇద్దరి మధ్య ఏదేదో ఉందని ఎవరెవరో మాట్లాడతారు. ఏమన్నా పోటీ ఉంటే అభివృద్ధిలో ఒకరిని చూసి ఒకరం పోటీ పడతాం. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అందరం కలసి ముందుకు పోదాం. వారి (హరీశ్‌రావు) కల అయినా, నా కల అయినా ఒకటే. కేసీఆర్‌ ఇంకో 10–15 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణకు, ప్రజలకు మంచి జరుగుతుంది.

ఆయన (హరీశ్‌రావు) 2004లోనే మంత్రి అయ్యారు. నేను మంత్రి అవుతానని ఎప్పడూ అనుకోలేదు. మేమిద్దరం కలసి ఒకే కేబినెట్‌లో ఉంటామని, కలసి పని చేస్తామని, ఇలా వేదికలు పంచుకుంటామని కూడా ఊహించలేదు. దీన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చిన సువర్ణవకాశంగా భావిస్తున్నాం. సొంత అన్నదమ్ముల మాదిరిగా 1991 నుంచి కలసి పెరిగాం. వారు హైదరాబాద్‌కు చదువుకోవడానికి వచ్చినప్పటి నుంచి... అంతకుముందు కరీంనగర్‌లో నేను వాళ్లింట్లో ఉన్నప్పటి నుంచి కలసి పెరిగినం.

అనుకోకుండా వచ్చిన ఒక అరుదైన అవకాశం ఏమిటంటే బావ, బావమరుదులు ఒకే కేబినెట్‌లో కలసి పని చేయడం దేశంలోనే మొదటిసారి కావచ్చు. మేం శాయశక్తులా పని చేస్తున్నాం. వంద శాతం ఇద్దరి అభిప్రాయం, కల, ఆశయం, మనందరి ఆశయం ఒకటే. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ చేయాలనే లక్ష్యం నెరవేరాలి. మనందరం కలసి పని చేయాలి. బంగారు తెలంగాణ, బంగారు సిద్దిపేట, బంగారు సిరిసిల్ల, ప్రతి నియోజకవర్గం బంగారు తునకగా మారాలి. హరీశ్‌రావు విలువైన సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్దాం’అని పేర్కొన్నారు.


కేటీఆర్‌ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం: హరీశ్‌
అంతకుముందు ఈ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు పోటీపడి ముందుకు పోతున్నామన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో నేను కొనసాగిస్తున్నా. సిరిసిల్లలో 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని మంత్రి కేటీఆర్‌ గత నాలుగేళ్లలోనే చేసి చూపించే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం దేశ, విదేశాల్లో పర్యటిస్తూ విజయవంతంగా తన శాఖను నిర్వహిస్తూనే మరోవైపు సిరిసిల్లను అభివృద్ధి పథంలో, అగ్రస్థానంలో నిలిపారు.

గత నాలుగేళ్లలో సిరిసిల్ల ఎవరూ గుర్తుపట్టలేనంత గొప్పగా మారిపోయింది. సిరిసిల్ల పట్టణ అభివృద్ధితోపాటు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడంలో కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఒకవైపు కాళేశ్వరం నీళ్లు, టెక్స్‌టైల్‌ పార్కుతో రానున్న రోజుల్లో సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారుతుంది. ఒకప్పుడు నిత్యం ఆత్మహత్యల వార్తలతో ఇబ్బందిపడిన సిరిసిల్ల ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు నేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

గత నాలుగేళ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు లేవంటే ఆ ఘనత అంతా మంత్రి కేటీఆర్‌కే దక్కుతుంది. ముఖ్యమంత్రి అప్పజెప్పిన బాధ్యతలను ఎవరి పరిధిలో వారు నిర్వహిస్తున్నాం. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. మెజారిటీ విషయంలోనూ పోటీపడి సిద్దిపేటను దాటేలా సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తలు కృషి చేయాలి’’అని హరీశ్‌రావు సూచించారు.  

>
మరిన్ని వార్తలు