చంద్రబాబు వస్తే ఇంట్లో ఉడుం జొచ్చినట్టే!

16 Nov, 2018 01:11 IST|Sakshi
వేములవాడ నియోజకవర్గం మల్యాలలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, సిరిసిల్ల: చంద్రబాబు వచ్చిండంటే ఇంట్లో ఉడుం జొచ్చినట్లేనని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో కరువు కాటకాలు, ఎన్‌కౌంటర్లు, ఆకలి చావులు, ఆత్మహత్యలు తప్ప ఏం ఉన్నాయని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం మల్యాలలో గురువారం టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ అర్ధరాత్రి కరెంటే వస్తుందన్నారు. తాము వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తామంటే అది ఉత్తదే అని విమర్శించారని, కానీ సీఎం కేసీఆర్‌ అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. నాలుగేళ్లలో చేసింది మేం చెబుతాం.. మీకు దమ్ముంటే మీ పాలనలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండని కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.

ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు రాసిన ఉత్తరాలు ఉపసంహరించుకొమ్మని అడిగే దమ్ము కాంగ్రెస్‌ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ల కోసం, అటువంటి నీళ్లను అడ్డుకున్న చంద్రబాబుతో జత కట్టిన కాంగ్రెస్‌ నేతలను ప్రజలు నిలదీయాలని ఆయన కోరారు. కూటమి గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, యాదా ద్రి పవర్‌ ప్లాంటు రద్దు అంటున్న కాంగ్రెస్‌ను జనం మాకొద్దంటున్నారని చెప్పారు. కూటమి నాయకులంతా కలసి కౌరవుల్లా వంద మంది వచ్చినా టీఆర్‌ఎస్‌ సింగిల్‌గానే గెలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు పంపే నోట్ల కట్టల కోసమే కాంగ్రెస్‌.. టీడీపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. బతుకమ్మ చీరల పంపిణీ అడ్డుకున్నది కాంగ్రెసోళ్లేన న్నారు. రైతుబంధు పథకం అమలు చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేనని కితాబిచ్చారు.  

కొబ్బరికాయలు మనకు, నీళ్లు ఆంధ్రకు.. 
గత ప్రభుత్వాలు రైతులకు కన్నీళ్లు తప్ప ఏం మిగల్చలేదని హరీశ్‌రావు విమర్శించారు. వారికి కనీసం  తాగునీరు కూడా ఇవ్వలేదన్నారు. కొబ్బరికాయలు మనకు, నీళ్లేమో ఆంధ్రకు తరలించుకుపోయారని విమర్శించారు. పెండింగ్‌ ప్రాజెక్టు అనే పేరు కాంగ్రెస్‌తోనే వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటేస్తే అది ఢిల్లీ, అమరావతిలకు పోతుంది.. టీజేఎస్‌కు వేస్తే ఎటూ కాకుండా పోతుందన్నారు. టీఆర్‌ఎస్‌కు వేస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌కు అండగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. రాజకీయాల్లో సానుభూతి ఉండదని, పనితీరే ప్రామాణికమని ఎంపీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో మండలానికి రూ.లక్ష వస్తే గొప్ప అని, తమ ప్రభుత్వ పాలనలో ఒక్కో గ్రామానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల నిధులు వచ్చాయని వేములవాడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు.

మరిన్ని వార్తలు