రూల్‌ పొజిషన్‌ తెలుసుకోండి!

16 Nov, 2017 03:51 IST|Sakshi

ఉత్తమ్‌కు మంత్రి హరీశ్‌ హితవు

అసెంబ్లీలో ఉపనాయకుడు ఉండగా సభ్యుడు    ఎలా నిరసన వ్యక్తం చేస్తారని అభ్యంతరం

మంత్రికే అవగాహన లేదన్న ఉత్తమ్‌

ఆయన విజ్ఞతకే వదిలేస్తామన్న హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తరఫున అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసే అంశంపై అధికార టీఆర్‌ఎస్‌ ఆసక్తికర విషయాన్ని లేవనెత్తింది. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం తరఫున నిరసన తెలిపే హక్కు సభలో ఎవరికుందనే విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి తాము సంతృప్తి చెందడం లేదంటూ, నిరసన తెలిపి వాకౌట్‌ చేసేందుకు కాంగ్రెస్‌ సన్నద్ధమయింది.

ఆ సమయంలో ప్రతిపక్ష నేత జానారెడ్డి సభలో లేరు. దీంతో సీఎల్పీలో సభ్యుడు మాత్రమే అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన తెలిపేందుకు ఉద్యుక్తులయ్యారు. ఆ సమయంలో మంత్రి హరీశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత లేకపోయినా ఉపనాయకుడు జీవన్‌రెడ్డి సభలోనే ఉన్నారని, నిరసన తెలిపే హక్కు ఆయనకే ఉంటుందని, రూల్స్‌ తెలుసుకోవాలని ఉత్తమ్‌కు హితవు పలికారు. కానీ, ఉపనాయకుడు ఉన్నా నిరసన తెలిపే హక్కు తమకు కూడా ఉంటుందని ఉత్తమ్‌ వాదించబోయారు. దీన్ని అడ్డుకున్న మంత్రి హరీశ్‌... అలా నిరసన తెలిపే హక్కు ఏ రూల్‌ పొజిషన్‌లో ఉందో చూపించాలని డిమాండ్‌ చేశారు.  

స్పీకర్‌పై ఆగ్రహం  
ఈ సమయంలో స్పీకర్‌ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ఏదో చెప్పబోగా ఉత్తమ్‌ ఆమెపై ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో చైర్‌ను ఎలా ప్రశ్నిస్తారని ఆమె ఉత్తమ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పుడు మరింత ఆగ్రహంతో ఉత్తమ్‌ ‘ఎస్‌.. ప్రశ్నిస్తాం!’అంటూ ఎదురుదాడి చేసే యత్నం చేశారు. ‘కాంగ్రెస్‌ సభ్యులకు సభా సంప్రదాయాల మీద గౌరవం లేదా? లేక నాయకుడు, ఉప నాయకుడిపై విశ్వాసం లేదా?’అని హరీశ్‌ మండిపడ్డారు. శాసనసభా వ్యవహారాల మంత్రికి అవగాహన లేదనడం ఉత్తమ్‌  విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీశ్‌ పేర్కొన్నారు.  

మూడు బిల్లులకు మండలి ఆమోదం
సాక్షి, హైదరాబాద్‌: విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) చట్టానికి సంబంధించిన రెండు సవరణల బిల్లులతో పాటు రాష్ట్ర ఎక్సైజ్‌ చట్టానికి సంబంధించిన మరో సవరణ బిల్లును బుధవారం శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎక్సైజ్‌ శాఖ జిల్లా అధికారిగా వ్యవహరించే ‘ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌’పోస్టు పేరును రాష్ట్ర ఎక్సైజ్‌ చట్టంలో ‘డిస్ట్రిక్ట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌’గా మార్చడంతో పాటు చట్టంలో ఫీజు/ఫీజులుగా ఉన్న పదాలను పన్ను/పన్నులుగా మార్చేందుకు చట్ట సవరణ బిల్లును మంత్రి పద్మారావు ప్రతిపా దించగా సభ ఆమోదం తెలిపింది. 

ఇతర స్థాయి అధికారులను సైతం జిల్లా ఎక్సైజ్‌ అధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం  సవరణ జరిపింది. అదేవిధంగా మైక్రో బ్రేవరీలు విక్రయించే డ్రాట్‌ బీరుపై 70శాతం వ్యాట్‌ విధించేందుకు మంత్రి ఈటల ప్రతిపాదించిన వ్యాట్‌ చట్ట సవరణ బిల్లును ఆమో దించింది. సారా, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ ఆడిట్‌ కాలపరిమితిని 4 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పెంచేందుకు మరో చట్ట సవరణ బిల్లు ను సైతం మండలి ఆమోదం తెలిపింది. 

మరిన్ని వార్తలు