‘ప్రభాకర్‌ రెడ్డికి నాకన్నా ఒక ఓటు ఎక్కువే రావాలి’

30 Mar, 2019 15:52 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : ఏప్రిల్‌ 11న జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగాలి.. ప్రభాకర్‌ రెడ్డికి నాకన్నా ఒక ఓటు ఎక్కువే రావాలంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కార్యకర్తలను కోరారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే హరీశ్‌ రావు మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న వ్యక్తి ప్రభాకర్‌ రెడ్డే అని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటకు ఎన్నికలకు కొత్త కాదని తెలిపారు. ప్రభాకర్‌ రెడ్డి కృషితో సిద్ధిపేట మీదుగా రెండు జాతీయ రహదారులే కాక జిల్లాకు పాస్‌పోర్టు ఆఫీస్‌, కేంద్రియ విద్యాలయం మంజూరయ్యాయని పేర్కొన్నారు.

బుల్లెట్‌ రైలు వేగంతో జిల్లాలో రైల్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే లైన్‌ పనులకు, భూసేకరణ కొరకు అవసరమయిన రూ.400 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. నర్సాపురంలో ఏప్రిల్‌ 3న జరిగే సీఎం కేసీఆర్‌ సభకు సిద్ధిపేట నుంచి 20 వేల మంది తరలిరావాలిని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మెదక్‌ను నం.1గా నిలుపుతా : కొత్త ప్రభాకర్‌ రెడ్డి
సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఎంపీగా రెండవ సారి అవకాశం వచ్చిందని మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సిద్ధిపేట ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను రెండో సారి అధికారంలోకి తెచ్చింది సిద్ధిపేట ప్రజలేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం ప్రారంభం​ చేసిన అది సిద్ధిపేట నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రాష్ట్రానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో 16 మంది ఎంపీలను గెలిపించుకుని కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. సిద్ధిపేటను హరీశ రావు నెంబర్‌ వన్‌గా ఎలా చేశారో.. మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గాన్ని అలానే అభివృద్ధి చేసి నంబర్‌ వన్‌గా నిలుపుతానని ఆయన హామీ ఇచ్చారు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు