కాంగ్రెస్‌కు ఓటేస్తే సంక్షోభం

11 Nov, 2018 02:33 IST|Sakshi
రైతు సమ్మేళన సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే సంక్షేమం

తెలంగాణలో చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు

ప్రాజెక్టులను అడ్డుకుంటుంది చంద్రబాబే

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

ఇబ్రహీంపట్నం రూరల్‌: కాంగ్రెస్‌కు ఓటేస్తే సంక్షోభం వస్తుందని.. అదే టీఆర్‌ఎస్‌కు వేస్తే సంక్షేమం వస్తుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగ్లూర్‌ సమీపంలో శనివారం జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారన్నారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని, వాటిని నిలి పివేయాలని చంద్రబాబు లేఖలు రాశారని చెప్పారు.

2014లో టీడీపీ మేనిఫెస్టోలో పాలమూరు ఎత్తిపోతల పూర్తిచేస్తామని ప్రకటించడం విడ్డూరమని ఆరోపించారు. డిండి ప్రాజెక్టుకు 2007లోనే డీపీఆర్‌ త యారైందన్నారు. అపెక్స్‌ కమిటీ ఎదుట ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖల మంత్రుల ముందే తెలంగాణ ప్రాజెక్టుల గురించి చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడితే.. తాను కడిగిపారేశానని గుర్తు చేశారు. ఇలాంటి నాయకుడికి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానిం చారు. చంద్రబాబుకు ఇటీవలే 19 పేజీల బహిరంగ లేఖ రాశానని హరీశ్‌ తెలిపారు.

పాలమూరు, డిండి ఎత్తిపోతల కట్టాలా? వద్దా? అనే విషయాన్ని చంద్రబాబుతో చెప్పించాలని కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుతో క్షమాపణ చెప్పించిన తరువాతనే కూటమి ఓట్లు అడగాలన్నారు. డిండి ప్రాజెక్టుకు చంద్రబాబు అడ్డుపడనని జానారెడ్డికి ఏమైనా రాసి ఇచ్చిండా అని హరీశ్‌ ప్రశ్నించారు. కూటమి వస్తే బతుకులు ఆగమేనని, రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి కావాలన్నా, నీళ్లు రావాలన్నా కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, పెట్టుబడి సాయం రూ. 8 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు..
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతుందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అమరావతిలో ఉన్న చంద్రబాబు వద్దే టికెట్లు ఫైనల్‌ చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కన్నుకొట్టే సిద్ధాంతం ఒకరిదైతే.. రెండు కళ్ల సిద్ధాంతం మరొకరిదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి.. టీడీపీకి ఓటేస్తే అమరావతికి వెళ్లాల్సి వస్తుందని, టీజేఎస్‌కు ఓటేస్తే వృథా అవుతుందన్నారు.

అవకాశం వైపా.. అభివృద్ధి వైపా అనేది మీరే ఆలోచించుకోవాలని హరీశ్‌ ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి చంద్రబాబును కడిగేస్తామన్నారు. పదవులను గడ్డిపోచతో సమానంగా వదిలేసిన వారసత్వం తమదని చెప్పారు. డిసెంబర్‌ 11 తరువాత తెలంగాణలో టీడీపీ కనుమరగవడం ఖాయమన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలో కేసీఆర్‌ని, ఇబ్రహీంపట్నంలో కిషన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, మండల కన్వీనర్‌ మొద్దు అంజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు