కాళేశ్వరం నీళ్లు కావాలా..కాంగ్రెస్‌ క్వార్టర్‌ కావాలా?

26 Sep, 2018 02:35 IST|Sakshi
రచ్చబండ వద్ద ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం

అభివృద్ధిని చూసి ఓటర్లే  నిర్ణయించుకోవాలి: హరీశ్‌ 

జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): ‘ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి.. ఇంటింటికీ తాగునీరు.. పంటపొలాలకు సాగునీరు.. అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం నీళ్లు కావాలా.. కాంగ్రెస్‌ ఇచ్చే క్వార్టర్‌ కావాలా ఓటర్లే నిర్ణయించుకోవాలని సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో మర్కూక్‌ మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కాలేదని ఆరోపించారు.

నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ 90 శాతం అభివృద్ధి చెందిందని, ప్రతి ఇంటికీ తాగునీరు.. పంట పొలాలకు సాగు నీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి చేశారని చెప్పారు. ఇంటి ముందు అభివృద్ధి కనిపించేలా చేశామని, కంటి ముందు అభ్యర్థి గుర్తు కారుకే ఓటు వేయాలని కోరారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు కాంగ్రెస్‌ నేతలు సీట్ల కోసం రంగులు మారుస్తున్నారని విమర్శించారు. పసుపు జెండాలను వదిలి టీడీపీ నేతలు మూడు రంగుల కండువాలు కప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ లక్షకుపైగా మెజార్టీతో గెలవడం ఖాయమని, ముందుగా మర్కూక్‌ మండలం వంద శాతం ఓట్లను ఏకగ్రీవంగా కేసీఆర్‌కు వేసి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.  

రచ్చబండ వద్ద తీర్మానం... 
కేసీఆర్‌కే వంద శాతం మా ఓట్లంటూ ఎర్రవల్లి గ్రామస్తులు రచ్చబండ వద్ద మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తీర్మానం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ట్యాంకు నుంచి రచ్చబండ వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రతిజ్ఞ చేయడం ఆదర్శమని, ఎర్రవల్లి ఏకగ్రీవం కావా లన్నారు. వంద శాతం కేసీఆర్‌కు ఓట్లు వేసి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రతి పల్లె ఎర్రవల్లి కావడం ఖాయమన్నారు.  

‘జలనిధి కాళేశ్వరం’ ముఖచిత్రం విడుదల
సాక్షి, హైదరాబాద్‌: ‘జలనిధి కాళేశ్వరం’ సంకలనం ముఖచిత్రాన్ని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం తన నివాసంలో విడుదల చేశారు. ఆయన మాట్లా డుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అహర్నిశలు పని చేస్తున్న ఇంజనీర్లు, శ్రామికుల సేవలను గుర్తిస్తూ కవులు అక్షర నీరాజనం అందించడం అభినందనీయమని ఆనందం వ్యక్తం చేశారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా రచయితల సం ఘం అధ్యక్షుడు జి.కృష్ణ మోహన్, జయశంకర్‌ సారస్వత సమితి వ్యవస్థాపకుడు జి.లక్ష్మయ్య లు సంకలనకర్తలుగా ఆధునిక ఆలయాల రూ పశిల్పులకు అక్షర నీరాజనం ‘జలనిధి కాళేశ్వ రం’పేరిట సంకలనం తీసుకువస్తున్నారు. 

మరిన్ని వార్తలు