‘కోదండరాం‌.. ఓ సారి పాత పేపర్లు ముంగటేసుకో’

12 Nov, 2018 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేవలం నాలుగు సీట్లకోసం టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం గాంధీభవన్‌ మెట్ల మీద పొర్లుదండాలు పెడుతున్నారని అపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీట్లకోసం కోదండరాం అమరావతికి, ఢిల్లీకి గులామయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారమే కోదండరాంను మహాకూటమి కమిటీ చైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. టీడీపీని తెలంగాణ ద్రోహి అన్న కోదండరాం ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ కోదండరాంను టార్గెట్‌ చేస్తే.. టీఆర్‌ఎస్‌ ఆయనను కంటికి రెప్పలా కాపాడిందన్నారు. పాత రోజులను ఆయన ఓసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. కోదండరాం పాత పేపర్లు ముంగటేసుని ఒక్క సారి చూసుకోవాలన్నారు.

సంగారెడ్డికి చెందిన టీజేఎస్‌ నేత నగేశ్‌, ఆయన అనుచరులు, ప్రైవేట్‌ ఉద్యోగ సంఘ నేతలు సోమవారం హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ..జేఏసీని విచ్ఛిన్నం చేయాలని చూసిన కాంగ్రెస్‌, టీడీపీలకు కోదండరాం దగ్గరయ్యారని విమర్శించారు. నాడు తిట్టిన వారు ఇప్పుడు కోదండరాంకు మంచివారయ్యారని, రక్షణ కవచంలా నిలిచిన టీఆర్‌ఎస్‌ చెడ్డదైందన్నారు. కోదండరాం రంగులు మార్చిన వైఖరిని ఎండగడుతామన్నారు. కాంగ్రెస్‌ గెలవలేని సీట్లను కోదండరాంకి ఇస్తుందని ఆరోపించారు. కోదండరాం నిజస్వరూపాన్ని త్వరలోనే బయటపెడతామన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు