వైఎస్సార్‌ కడప హ్యట్రిక్‌ వీరులు..

20 Mar, 2019 11:04 IST|Sakshi

జిల్లాలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన 

8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు  

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు దక్కిన అరుదైన అవకాశం  

సాక్షి, కడప: జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 8మంది ఎమ్మెల్యేలుగా.. ఐదుగురు ఎంపీలుగా వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ వీరులుగా చరిత్రకెక్కారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు సభ్యునిగా హ్యాట్రిక్‌ సాధించిన చరిత్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు సార్లు హ్యాట్రిక్‌ సాధించారు. 1952 నుంచి ఉన్న ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే బద్వేల్, కమలాపురం, కడప, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే హ్యాట్రిక్‌ రికార్డులు నమోదు కాలేదు.

 పులివెందుల నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985లలో కూడా ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండో పర్యాయం 1999, 2004, 2009లో కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

  • 2004 వరకూ నియోజకవర్గంగా ఉండి, పునర్విభజన ప్రక్రియలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గంలో ఆర్‌. రాజగోపాల్‌రెడ్డి 1983, 85, 89లలో అక్కడి నుంచి విజయం సాధించి హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్నారు.
  • రాయచోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే  గడికోట శ్రీకాంత్‌రెడ్డి 2009, 2012 (ఉపఎన్నికలు), 2014లలో వరసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించారు. 
  • రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సైతం 2009, 2012 (ఉప ఎన్నికలు), 2014లో వరుసగా విజయం సాధించి చరిత్రలో నిలిచారు. 
  • రాజంపేటలో కొండూరు ప్రభావతమ్మ 1974, 1978, 1983లో వరుసగా విజయం సాధించారు.
  • ప్రొద్దుటూరులో మాజీ  ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి డబుల్‌ హ్యాట్రిక్‌ మిస్‌ అయ్యారు. 1985 నుంచి 2004 వరకూ వరుసగా విజయం సాధించారు.
  • జమ్మలమడుగులో మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి 1983, 1985, 1989 వరుస విజయాన్ని సొంతం చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం 2004, 2009, 2014లో వరుసగా విజయం సాధించారు.  

పార్లమెంటు సభ్యులు సైతం..

  • కడప పార్లమెంటు సభ్యులు ఎద్దుల ఈశ్వరరెడ్డి 1962, 1967, 1971వరుసగా విజయం సాధించారు. తర్వాత 1989, 1991, 1996, 1998లలో వరుసగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజయం సాధించారు. 
  • రాజంపేట పార్లమెంటు పరిధిలో పి. పార్థసారధి 1967, 1971, 1977, 1980లో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్‌ అక్కడి నుంచి ఆరు సార్లు విజయం సాధించగా వరుసగా 1989, 1991, 1996, 1998లలో విజయాలను సొంతం చేసుకొని హ్యాట్రిక్‌ రికార్డు కెక్కారు.  
మరిన్ని వార్తలు