'అమిత్‌ షా కుమారుడా.. నేనింకా పేపర్‌ చదవలేదు'

9 Oct, 2017 18:50 IST|Sakshi

పట్నా : బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జైశా పెద్ద మొత్తంలో ఆస్తులు పోగేశాడంటూ వచ్చిన వార్తలపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ స్పందించేందుకు నిరాకరించారు. ఆ విషయం గురించి అసలు తనకు ఏమీ తెలియదని అన్నారు. ఈ రోజు తాను వార్తా పత్రికలు చదవనే లేదని, అందుకే తనకు ఆ విషయం తెలియదని చెప్పారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడ బెట్టారని ఓ వెబ్‌ సైట్‌ ఆర్టికల్‌లో వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన అమిత్‌ షా కుమారుడు జైశా 'నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. నన్ను అపఖ్యాతి పాలుచేసేందుకు అలాంటి ఆరోపణలు చేశారు. వారిపై పరువు నష్టం దావా వేస్తున్నాం' అని వివరణ ఇచ్చారు. కాగా, లాలూ కుమారుడు అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ వారితో తెగదెంపులు చేసుకొని బీజేపీతో ఇటీవలె పొత్తు పెట్టుకున్న నితీష్‌ కుమార్‌ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ప్రస్తుతం అమిత్‌ షా కుమారుడిపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించగా 'ఈ రోజు ఉదయం నేను వార్తా పత్రికలు చూడలేదు.. అందుకే నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను' అని స్పందించేందుకు నిరాకరించారు.

మరిన్ని వార్తలు