సైలెంట్‌గా ఉంటాననుకుంటున్నారా : కుమారస్వామి

15 Sep, 2018 10:33 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పథకం రచిస్తున్న సూత్రధారులెవరో తనకు తెలుసునని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ‘ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుసు. ఇందుకోసం డబ్బులు సమీకరిస్తున్న వారి వివరాలు కూడా తెలుసు. నేను సైలెంట్‌గా ఉంటాననుకుంటున్నారా.? అలా ఎప్పటికీ జరగదంటూ’ కుమారస్వామి ప్రతిపక్ష బీజేపీని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. జర్కిహోలి సోదరులు తమకు టచ్‌లోనే ఉన్నారని.. తమ ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అనే అంశంపై తనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.

కాగా బెలగావి రూరల్‌ ఎమ్మెల్యే లక్ష్మీ హెబాల్కర్‌తో విభేదాలు.. జర్కిహోలి సోదరుల నిష్ర్కమణకు దారితీసేలా ఉండటంతో కాంగ్రెస్‌తో పాటు సంకీర్ణ సర్కార్‌లోనూ ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. విభేదాల పరిష్కారానికి కేపీసీసీ చీఫ్‌ డీజీ రావు, డిప్యూటీ సీఎం పరమేశ్వర చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో 14 మంది ఎమ్మెల్యేలతో తాము సర్కార్‌ నుంచి వైదొలుగుతామని జర్కిహోలి సోదరులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం కుమారస్వామి, కాంగ్రెస్‌ నేతలు అప్sరమత్తమయ్యారు. బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.

డబ్బుతో ప్రలోభపెట్టాలని చూస్తున్నారు..
తమ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి జి పరమేశ్వర ఆరోపించారు. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ‌, అవినీతి నిరోధక శాఖను సంప్రదించి చట్టపరంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై సాగునీటి పారుదల శాఖ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌తో చర్చించామన్న పరమేశ్వర.. ఈ ఫిర్యాదు చేస్తోంది కేవలం కాంగ్రెస్‌ పార్టీయేనని, దీనితో కర్ణాటక ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుమారస్వామి, కాంగ్రెస్‌ నేతలు తమపై అభియోగాలు మోపుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.

మరిన్ని వార్తలు