‘ఎవరి దయ వల్లనో నేను సీఎం కాలేదు’

26 Jun, 2018 13:29 IST|Sakshi
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(ఫైల్‌ఫోటో)

సాక్షి, బెంగుళూరు : కాంగ్రెస్‌ - జేడీఎస్‌ కూటమిలో నెలకొన్న విబేధాలు ఒక్కొక్కటి బయటకొస్తున్న నేపధ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ‘నేను ఎవరి దయ వల్లనో ముఖ్యమంత్రిని కాలేదు. ఎవరూ నాకు ముఖ్యమంత్రి పీఠాన్ని దానం చేయలేద’ని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుమారస్వామి, సిద్దరామయ్యల మధ్య బడ్జెట్‌ ప్రవేశపెట్టే విషయంలో వచ్చిన వివాదాలే వల్లే కుమారస్వామి ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

నూతన బడ్జెట్‌ ప్రవేశ పెట్టే విషయంలో సిద్ధరామయ్యకు, కుమారస్వామికి మధ్య విభేదాలు ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్దరామయ్య తన అనుచరులతో రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో మాజీ సీఎం, నూతన సీఎంల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యింది. ఈ వీడియోలో సిద్దరామయ్య కుమారస్వామిని ఉద్దేశిస్తూ ‘ఆయన మన మద్దతు వల్లే ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కాంగ్రెస్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో బడ్జెట్‌ అవసరం లేదని తన అనుచరుల’తో తెలిపాడు.

సిద్దరామయ్య వ్యాఖ్యలకు కౌంటర్‌గా కుమారస్వామి ‘ఎవరూ నాకు ముఖ్యమంత్రి పీఠాన్ని దానం చేయలేదని, ఎవరి దయ వల్లనో నేను ముఖ్యమంత్రిని కాలేద’ని వ్యాఖ్యానించారు. అయితే గతంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమిలో భాగంగా ఏర్పడే ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నేనే సీఎంగా కొనసాగుతా. కాంగ్రెస్‌ నాకు పూర్తి మద్దతు ఇచ్చింది’ అని ప్రమాణ స్వీకారం అనంతరం కుమారస్వామి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు