రాజకీయాల నుంచి తప్పుకుంటాను

3 Aug, 2019 20:02 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కుమారస్వామి శనివారం న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి రావడం​.. ముఖ్యమంత్రి అవ్వడం అన్ని యాదృచ్చికంగానే జరిగాయి. దేవుడి దయ వల్ల రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం వచ్చింది. ఈ 14 నెలలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడ్డాను. ఎవరినో సంతృప్తి పరచాల్సిన అవసరం నాకు లేదు. రాష్ట్రం కోసం పని చేశాను. ఆ తృప్తి చాలు నాకు. త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుందామని భావిస్తున్నాను’ అంటూ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

116మంది బలం ఉన్న కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమి సర్కారును కూల్చడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఓ వైపు యడియూరప్ప కాచుక్కూర్చోగా... కేవలం 37 స్థానాలు మాత్రమే గెల్చుకున్న కుమారస్వామి అందలం ఎక్కడాన్ని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేకపోయారు. వెలుపలి నుంచి యడియూరప్ప, లోపలినుంచి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కర్ణాటకలో 14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం గత నెల కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య గత నెల 23న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. అనంతరం బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడియూరప్ప కర్ణాటక సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు