వెల్లువెత్తిన చైతన్యం.. ఓటరుకు వందనం!

11 Apr, 2019 10:22 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉయదం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రత పెరిగే అవకాశముండటంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి  కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరడం.. ఓటింగ్‌పై ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని చాటుతోంది.

కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు..
ఓటు వేసేందుకు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నా.. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. ఉదయం 9.30 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు బూత్ నంబర్ 197లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఇదే జిల్లాలోని చింతలపూడిలో 153 బూత్‌లో ఈవీఎం లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని 161వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం  లేదు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్‌ బూగ్‌ నంబర్లు 20,24,26, 39,27, 51, 54, 69 లో ఈవీఎంలు పనిచేయడం పనిచేయడం లేదు. శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం లో 214, 210 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. విజయనగరం జిల్లా సీతాపురం మండలం గెడ్లలుపిలోని 105 పోలింగ్‌ బూత్‌లో ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈవీఎంలు మొరాయించడంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో 51 పోలింగ్‌ కేంద్రాల్లో, పాతపట్నంలో 72, టెక్కలిలో 49 పోలింగ్‌ బూత్‌ల్లో పోలింగ్‌ నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు