అజిత్‌కు బీజేపీ గాలం

22 Jan, 2019 12:00 IST|Sakshi
తమిళిసై సౌందర్‌రాజన్‌ , అజిత్‌

చెన్నై, పెరంబూరు: సినిమాలను రాజకీయాలను వేరుగా చూడలేం. సినిమా వాళ్లు రాజకీయాలపై కన్నేస్తుంటే, రాజకీయనాయకులు ప్రముఖ నటులను తమ పార్టీలోకి లాగడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు సినీ గ్లామర్‌పై ఆధారపడుతున్నాయి. అలాగే అన్ని పార్టీల్లోనూ సినిమా తారలు ఉన్నారు. ఒక్క బీజేపీలోనే సినీ గ్లామర్‌ అంతగా లేదు. దీంతో కమలహాసన్, రజనీకాంత్‌లకు గాలం వేశారు. అయితే కమలహాసన్‌ రాజకీయ పార్టీని ప్రారంభించినా బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. ఆయన అన్నాడీఎంకే పార్టీపై ఆరోపణలు చేస్తూ మరోపక్క కాంగ్రెస్‌తో సాన్నిహిత్యాన్ని మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. ఇటీవల రాహుల్‌గాంధికీ ప్రధానమంత్రి అర్హత ఉందని బహిరంగంగానే ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో కమల్‌ తమ వలలో పడే అవకాశం లేదని నిర్ణయించుకున్న బీజేపీ తన దృష్టిని రజనీకాంత్‌పై మళ్లించింది. ఆయన ఆ మధ్య ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానని చెప్పడంతో ఆయన్ని తమ పార్టీలోకి లాగే ప్రయత్నాలు చేసింది. అందుకు ఒక కేంద్రమంత్రితో చర్చలు జరిపించింది. అయితే రజనీకాంత్‌ ఇప్పటికీ రాజకీయ పార్టీని ప్రారంభించే ధైర్యమే చేయలేదు.

అజిత్‌ నిజాయితీపరుడు
ఎలాగైనా తమిళనాడులో కూటమి ఏర్పాటు చేసుకుని అధిక స్థానాలను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ తాజాగా ఇక్కడ అధిక అభిమానధనం కలిగిన నటుడు అజిత్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అజిత్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఆదివారం తిరుపూర్‌లో పలువురు సభ్యులను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ పార్టీ నిర్వహించింది. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన వారితో పాటు నటుడు అజిత్‌ అభిమానులు పలువురు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన తమిళిసై సౌందర్‌రాజన్‌ సినీ కళాకారుల్లోనే నటుడు అజిత్‌ నిజాయితీపరుడైన నటుడని పేర్కొన్నారు.ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బును సేవాకార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని అన్నారు. ఆయనలా అతని అభిమానులు నిజాయితీపరులని, అందుకే వారు బీజేపీ పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. కాగా నటుడు అజిత్‌ ఇంత వరకూ ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. అసలు రాజకీయాల గురించి నోరు మెదపలేదు. అసలు రాజకీయాలకే కాదు, సినీ కార్యక్రమాలకు దూరంగా ఉండే అజిత్‌ బీజేపీ వలలో పడతారా అన్నది ఆసక్తిగా మారింది. ఆ పార్టీ ఆయన్ని రాజకీయాల్లోకి లాగగలదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

>
మరిన్ని వార్తలు