జైట్లీ క్షమించేశారు...!

29 May, 2018 10:39 IST|Sakshi
కుమార్‌ విశ్వాస్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అసంతృప్త నేత కుమార్‌ విశ్వాస్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కేం‍ద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన కుమార్‌ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. జైట్లీకి, ఆయన కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి తనను క్షమించాలంటూ తన లాయర్‌ అమిత్‌ యాదవ్‌ ద్వారా కోర్టును కోరారు. కుమార్‌ క్షమాపణను స్వీకరిస్తున్నట్లు జైట్లీ తరపున కోర్టుకు హాజరైన ఆయన లాయర్లు రాజీవ్‌ నాయర్‌, మాణిక్‌ డోగ్రా తెలిపారు. దీంతో కుమార్‌ విశ్వాస్‌పై ఉన్న పరువు నష్టం దావా కేసును ఎత్తివేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

కాగా, 13ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జైట్లీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేజ్రీవాల్‌తో సహా పలువురు ఆప్‌ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జైట్లీ వారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన జైట్లీ పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ సహా, ఆప్‌ నేతలు రాఘవ్‌ చద్దా, అశుతోష్‌, సంజయ్‌ సింగ్‌, దీపక్‌ బాజ్‌పేయిలు కూడా క్షమాపణలు తెలిపారు. తాజాగా కుమార్‌ విశ్వాస్‌ కూడా క్షమాపణలు తెలపడంతో జైట్లీ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.

మరిన్ని వార్తలు