ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

16 Apr, 2019 15:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదని హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పంచాయతీ రాజ్ యాక్ట్ 285 ఏ సెక్షన్ సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం 50 శాతం లోబడే ఉండాలని చెబుతుందని కాబట్టి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఆపలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

ఎస్సీ, ఎస్టీల కంటే బీసీలకే పంచాయితీ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది రామచందర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. బీసీలకు కేటాయించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని పిటిషనర్‌ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై మరోసారి వాదనలు వింటామన్న కోర్టు.. ఎలక్షన్ కమిషన్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి , తెలంగాణ బీసీ కోఆపరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు