ఫిరాయించి పదవులా: ధర్మాసనం ప్రశ్న

13 Mar, 2018 14:17 IST|Sakshi
గవర్నర్‌, సీఎం సమక్షంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రమాణస్వీకారం(ఫైల్‌)

ఏ అధికారంతో మంత్రులుగా కొనసాగుతున్నారు?

మంత్రి పదవులు చేపట్టిన నలుగురికి ధర్మాసనం ప్రశ్న

వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన 18 మంది ఎమ్మెల్యేలకూ హైకోర్టు నోటీసులు

అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి సైతం నోటీసులు జారీ

పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశం.. విచారణ రెండు వారాలు వాయిదా

సాక్షి, హైదరాబాద్ ‌: వైఎస్సార్‌ సీపీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 18 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో మంత్రులుగా కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని పార్టీ ఫిరాయించిన నలుగురు మంత్రులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలతోపాటు న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులను ఆదేశించిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొంది అనంతరం టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటంతోపాటు మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురు ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు
పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 22 మంది వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో వారిని న్యాయస్థానం నేరుగా అనర్హులుగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఫిరాయింపుదారులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని తెలిపారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఫిరాయింపుదారులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతోందో అర్థం కాకుండా ఉందన్నారు. ఇదే వ్యవహారంపై హైకోర్టులో ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ఒకసారి విచారణకు వచ్చినా మళ్లీ విచారణకు నోచుకోలేదని నివేదించారు. న్యాయస్థానాల్లో ఈ పరిస్థితిని చూసి ఫిరాయింపుదారులు నవ్వుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఫిరాయింపుదారుల్లో నలుగురు ఏకంగా మంత్రి పదవులు అనుభవిస్తున్నారని, అసలు ఫిరాయించడమే రాజ్యాంగ విరుద్ధమైప్పుడు వీరు మంత్రులుగా ఎలా ఉంటారో అర్థం కాకుండా ఉందన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ నోటీసులు జారీ చేసి వారి వాదనలు వింటామని పేర్కొంది. అయితే ఒకసారి వాయిదా పడిన కేసు మళ్లీ విచారణకు రావడం లేదని మోహన్‌రెడ్డి పేర్కొనగా తాము చేయగలిగింది ఏమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

నవ్వుకుంటే మేం చేయగలిగింది ఏమీ లేదు
ప్రస్తుతం హైకోర్టులో 3.25 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, నెలకు 5 వేల చొప్పున పెండింగ్‌ కేసులు పెరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ప్రతీ కేసూ ముఖ్యమైనదేనని, తాము ఏ కేసుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశ్నించింది. ఏ అధికారంతో పదవుల్లో కొనసాగుతున్నారో నలుగురు మంత్రులను సైతం వివరణ కోరతామని స్పష్టం చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమను (కోర్టును) చూసి నవ్వుకుంటే తాము చేయగలింది ఏమీ లేదంటూ వ్యాఖ్యానించింది.

హైకోర్టు నోటీసులు జారీ చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు
1. ఎం.అశోక్‌రెడ్డి
2. పి.డేవిడ్‌రాజు
3. పి.రామారావు
4. గొట్టిపాటి రవికుమార్
5. పాశం సునీల్‌కుమార్
6. తిరివీధి జయరాములు
7. బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
8. ఎస్‌.వి.మోహన్‌రెడ్డి
9. మణి గాంధీ
10. అత్తార్‌ చాంద్‌ బాషా
11. జలీల్‌ ఖాన్
12. ఉప్పులేటి కల్పన
13. జ్యోతుల నెహ్రూ
14. వరుపుల సుబ్బారావు
15. వి.రాజేశ్వరి
16. కిడారి సరేశ్వరరావు
17. గిడ్డి ఈశ్వరి
18. కలమట వెంకట రమణమూర్తి

హైకోర్టు నోటీసులు జారీ చేసిన ఫిరాయింపు మంత్రులు
1. చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి
2. ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
3. భూమా అఖిలప్రియ
4. రావు వెంకట సుజయకృష్ణ రంగారావు

మరిన్ని వార్తలు