టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్‌.. ఎన్నిక చెల్లదని ఆదేశాలు

27 Nov, 2018 17:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనంతరం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. శాసనసభ సభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆయనపై వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారనే ఆరోపణలపై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్‌లో పేర్కొనపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈరన్న తప్పుడు సమాచారం ఇచ్చారని, కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్‌ తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు.. ఆయన స్థానంలో డాక్టర్‌ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు ఇచ్చింది.

వివరాలు దాచి అఫిడవిట్‌..!
టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన అఫిడవిట్‌లో పొందుపరచలేదు. ఈ విషయాలన్నీ  2014 ఎన్నికల సమయంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ తిప్పేస్వామి రిటర్నరింగ్‌ అధికారి దృష్టికి తెచ్చారు. కాని అప్పుడు పట్టించుకోలేదు. ఈ విషయమై ఆయన న్యాయపోరాటం చేసి ఇప్పుడు విజయం సాధించారు.  

మరిన్ని వార్తలు