గవర్నర్‌ గో బ్యాక్‌.. సభలో తీవ్ర గందరగోళం

29 Jan, 2020 10:55 IST|Sakshi

తిరువనంతపురం: అత్యంత హైడ్రామా నడుమ కేరళ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ఉయదం ప్రారంభమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసనకు దిగడం.. యాంటీ సీఏఏ పోస్టర్లు పట్టుకొని.. ‘గవర్నర్‌.. గో బ్యాక్‌’ నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో మార్షల్స్‌ రంగప్రవేశం చేసి.. నిరసనకు దిగిన ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.

మార్షల్స్‌ భద్రత మధ్య అసెంబ్లీలోకి ప్రవేశించిన గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌.. తనను ఉద్దేశించి నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలకు చేతులు జోడించి ‘కృతజ్ఞతలు’ తెలిపారు. ఆయనకు ఇరువైపుల సీఎం పినరయి విజయన్‌, స్పీకర్‌ పీ శ్రీరామకృష్ణన్‌ ఉన్నారు. మార్షల్‌ భద్రత నడుమ గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ.. సభ నుంచి వాకౌట్‌ చేశారు. అసెంబ్లీ గేటు వద్దకు చేరుకొని వారు ధర్నాకు దిగారు.

సీఎం చదవమన్నారని.. చదువుతున్నా!
తన ప్రసంగంలో భాగంగా సీఏఏ వ్యతిరేక తీర్మానంలోని కొంతభాగాన్ని గవర్నర్‌ చదివి వినిపించారు. అయితే,  ఇది తన అభిప్రాయం కాదని, కేవలం ప్రభుత్వ అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవించనప్పటికీ.. సీఎం కోరిక మేరకు, ఆయన దీనిని నేను చదవాలని కోరుతున్నందుకే చదివి వినిపించానని గవర్నర్‌ ఖాన్‌ వివరించారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంతో సీఎం విజయన్‌కు, గవర్నర్‌ ఖాన్‌కు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. విజయన్‌ సర్కారు తీరును గవర్నర్‌ బాహాటంగానే తప్పుబడుతున్నారు.

మరిన్ని వార్తలు