ఎన్డీఏకు టీడీపీ రాంరాం.. నిజమేనా?

16 Mar, 2018 10:21 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సంజీవని ప్రత్యేక హోదాపై పూటకో మాట మాట్లాడిన టీడీపీ.. ఎన్డీఏ నుంచి వైదొలిగే అంశంలోనూ అదేతీరును అనుసరిస్తోంది. ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించిన చంద్రబాబు.. టీడీపీ మాత్రం ఎన్డీఏలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. రోజులు గడవముందే మళ్లీ వ్యతిరేక ప్రకటనలు గుప్పిస్తున్నారు.

‘ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చేసింది’ అంటూ శుక్రవారం ఉదయం నుంచి వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఎంపీలు, పొలిట్‌ బ్యూరోతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన తర్వాత.. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు బాబు లేఖరాశారని, ఇక తెగదెంపులు అయిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై టీడీపీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఇదిలాఉంటే, ప్రజల్లో మాత్రం..‘‘ఒకవేళ బాబు ఎన్డీఏ నుంచి వైదొలిగినా.. తిరిగి ‘నేనేమంటానంటే.. ’ తరహా వివరణలతో మళ్లీ యూటర్న్‌ తీసుకోరన్న నమ్మకంలేదు’ అనే భావన వ్యక్తమవుతోంది.

అవిశ్వాసంపై ఉల్టా పల్టా : హోదా విషయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులపైనా చంద్రబాబు ఉల్టాపల్టా అయ్యారు. టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని రాత్రిదాకా జరిగిన ప్రచారం తెల్లారేసరికి ఓటిపోయింది. వైఎస్సార్‌సీపీ తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వబోదని, తామే ప్రత్యేకంగా తీర్మానం పెడతామని ఢిల్లీలోని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు