అస్సాం బీజేపీలో ముసలం పుట్టేనా?

23 Mar, 2019 15:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ గురువారం నాడు లోక్‌సభ సభ్యుల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగానే ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ట్వీట్లపై ట్వీట్లు వదిలారు. టిక్కెట్లు లభించిన అభ్యర్థులను అభినందించేందుకు ఆయన ట్వీట్లు చేశారనుకుంటే పొరపాటే అవుతుంది. టిక్కెట్టు ఖాయం అనుకున్న అస్సాం ఆర్థిక మంత్రి హిమంత విశ్వశర్మకు ఎందుకు టిక్కెట్‌ ఇవ్వలేదో వివరించడానికి అమిత్‌ షా ట్వీట్లు చేశారు. బీజేపీ నేతృత్వంలో ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌ఈడీఏ) చైర్మన్‌గా విశిష్ట బాధ్యతలు నిర్వహిస్తున్నందుకే ఆయనకు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వలేక పోయామని ఆయన వివరించారు.

ఒకప్పుడు ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉండేది. ఈ రోజు ఆరు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే హిమంత విశ్వశర్మ చేసిన కృషియే కారణం. 2011లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆయన అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. ముఖ్యమంత్రి పదవి తనకే వస్తుందని అప్పుడు ఆయన ఆశించారు. అయితే ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి మాత్రమే దక్కింది. ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్‌ అధిష్టానం తరుణ్‌ గొగోయ్‌కి ఇచ్చింది. దాంతో అసంతృప్తితో ఉన్న విశ్వశర్మ 2015లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ తిరుగుబాటుదారులను, అసంతృప్తులను బీజేపీలోకి తీసుకొచ్చారు. 2016 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో ముఖ్యపాత్ర వహించారు. అయినప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి కాకుండా ఆర్థిక మంత్రి పదవి దక్కింది.

ఆ నేపథ్యంలోనే ఆయనకు ఎన్‌ఈడీఏ చైర్మన్‌ పదవిని అప్పగించారు. కేంద్ర రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే ఆయన ఎన్‌ఈడీఏ చైర్మన్‌ పదవిని చిత్తశుద్ధితోనే నిర్వహించారు. మార్చి 16వ తేదీన ‘ఆయనకు లోక్‌సభ సీటు రాకుండా ఇంకెవరికి వస్తుంది. పేరు ఎప్పుడో ఖాయం అయింది. జాబితా ప్రకటించడమే తరువాయి’ అని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెప్పాయి. ఇంతలో తలకిందులయింది. అస్సాం నుంచి టిక్కెట్‌ కోసం బీజేపీలో మొదటి నుంచి ఉన్న సీనియర్‌ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్లనే విశ్వశర్మకు టిక్కెట్‌ ఇవ్వలేక పోయారని రాష్ట్ర పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర పార్టీ అభిప్రాయాలను పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకోక పోవడం వల్లనే ఇలా జరుగుతోందని, అస్సాం గణ పరిషద్‌తో పొత్తు ఒద్దన్నా కూడా కేంద్ర నాయకత్వం పెట్టుకుందని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి.

ఇప్పుడే విశ్వశర్మ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరవేయక పోవచ్చని, 2021లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన ఏమిటో పార్టీ అధిష్టానంకు తెలిసి వస్తుందని ఆయన అనుచరులు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు