అమిత్‌ షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్‌

14 Sep, 2019 14:33 IST|Sakshi

ఆయన వ్యాఖ్యలు దేశ ఐక్యతకు భంగం

వెంటనే వెనుకకు తీసుకోవాలి 

న్యూఢిల్లీ: ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమిత్‌ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ సైతం ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

‘బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ మేం నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు మాకు షాక్‌ ఇచ్చాయి. ఈ వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయి. అమిత్‌ షా తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. తీవ్ర ఆందోళనకు గురిచేసిన షా వ్యాఖ్యలపై ఎల్లుండి పార్టీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో చర్చించి.. తదుపరి కార్యాచరణ చేపడతామని స్టాలిన్‌ పేర్కొన్నారు.

శనివారం హిందీ దివస్‌ సందర్భంగా అమిత్‌ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అదే విధంగా..‘ భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతీ భాష దేనకదే ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే ప్రపంచంలో భారత్‌ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ, వల్లభబాయ్‌ పటేల్‌ ఆశయాలను నెరవేర్చాలంటే మాతృభాషతో పాటు హిందీ భాష వాడకాన్ని పెంచాలి’ అని ట్విటర్‌ వేదికగా భారత ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
చదవండి: దేశమంటే..హిందీ, హిందూ, హిందుత్వ కాదు: ఒవైసీ

మరిన్ని వార్తలు