లెజెండ్ల స్థావరం..సెంటిమెంట్ల‘పురం’

19 Mar, 2019 10:29 IST|Sakshi
హిందూపురం నియోజకవర్గం

   మైనారిటీ ఓటు బ్యాంక్‌తో టీడీపీ చెలగాటం 

   ఓటర్ల సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకున్న ప్రజాప్రతినిధులు  

వ్యవసాయం, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా పేరు గాంచిన హిందూపురం నియోజకవర్గానికి జిల్లాలోనే ప్రత్యేక స్థానముంది. 1952లో నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వచ్చింది. 1983లో టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపించినప్పటి నుంచి 2014 వరకూ ఆ పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తూ వచ్చారు. ఎన్టీఆర్‌పై నియోజకవర్గ ప్రజలకు ఉన్న అభిమానం ఈ రూపంగా బహిర్గతమవుతూ వస్తోంది. ఈ సెంటి మెంట్‌ను అవకాశంగా తీసుకుని పురం ముస్లిం ఓటు బ్యాంక్‌తో టీడీపీ ప్రజాప్రతినిధులు చెలగాటమాడుతూ వచ్చారు. ‘ఏరు దాటే వరకూ మల్లన్న.. ఏరు దాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ రావడంతో నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా పడకేసింది. 

నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2009లో హిందూపురం మున్సిపాలిటీ, మండలం, లేపాక్షి, చిలమత్తూరు మండలాలను కలిపి హిందూపురం నియోజకవర్గంగా చేశారు. నియోజకవర్గంలో 2,19,012 మంది ఓటర్లు ఉన్నారు. సుదీర్ఘ కాలంగా ఒకే పార్టీ (టీడీపీ)కి చెందిన వారినే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటూ రావడంతో హిందూపురం నియోజక వర్గ అభివృద్ధిపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. ఎవరు బరిలో నిలిచినా.. ప్రజలు గుడ్డిగా తమకే ఓటేస్తారనే ధీమా ప్రజాప్రతినిధుల దిగజారుడు రాజకీయాలకు కారణమైంది.

హిందూపురం ఎమ్మెల్యేలు వీరే..  

ఏడాది ఎమ్మెల్యే పార్టీ
1952 శివశంకరరెడ్డి కాంగ్రెస్‌
1955 కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్‌
1962 కె.రామకృష్ణారెడ్డి స్వతంత్ర
1967 కె.అంజనారెడ్డి స్వతంత్ర
1972 జి.సోమశేఖర్‌ కాంగ్రెస్‌
1978 కె.తిప్పేస్వామి కాంగ్రెస్‌(ఐ)
1983 పి.రంగనాయకులు టీడీపీ
1985 ఎన్‌.టి.రామరావు టీడీపీ
1989 ఎన్‌.టి.రామరావు టీడీపీ
1994 ఎన్‌.టి.రామరావు టీడీపీ
1996 ఎన్‌.హరికృష్ణ టీడీపీ
1999 సి.సి.వెంకటరాముడు టీడీపీ
2004 పి.రంగనాయకులు టీడీపీ
2009 అబ్దుల్‌ ఘనీ టీడీపీ
2014 ఎన్‌.బాలకృష్ణ టీడీపీ

బాలయ్యకు పట్టని ప్రజల గోడు 
తనను గెలిపిస్తే పురం నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపడతానంటూ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ స్పష్టమైన హామీనిచ్చాడు. ఇలా కొళాయి తిప్పితే జలజల నీరు వస్తుందంటూ ఊరించారు. అరచేతిలో నియోజకవర్గ ప్రజలకు సినిమా చూపించేసి, గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు.  ఐదేళ్ల పదవీ కాలంలో ఏనాడూ నియోజకవర్గ ప్రజలను తన దగ్గరకు ఆయన తీసుకోలేదు. పైగా సమస్యలు వివరించేందుకు వెళ్లిన పార్టీ కార్యకర్తలపై సైతం భౌతిక దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చాడు. ఐదేళ్లు సినిమాల్లో నటించేందుకే సమయం కేటాయించి, ఎన్నికలు దగ్గర పడినప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు గొల్లపల్లి తాగునీటి పైప్‌లైన్‌ పనులు పూర్తి కాకనే హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశాడు.  

నెరవేరని హామీలు 
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనా తర్వాత నియోజకవర్గ ప్రజలను ఊరిస్తూ బాలయ్య బాబు పలు హామీలు గుప్పించారు. వాటిలో ఏ ఒక్కటీ నెరవేరకపోవడం గమనార్హం.  

  • ‘హిందూపురం పారిశ్రామిక కారిడార్‌ వచ్చేస్తోంది. కొకొల్లలుగా పరిశ్రమలు వచ్చేస్తాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో హిందూపురాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చివేస్తా’ అంటూ బాలయ్య ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమను ఈ ప్రాంతానికి ఆయన తీసుకురాలేకపోయాడు. అర్భాటంగా చిలమత్తూరు వద్ద ప్రారంభించిన రాగమయూరి ఇండ్రస్టీయల్‌ హబ్‌ నేడు రియల్‌ వ్యాపారానికి కేంద్రమైపోయింది.    
  • మొన్నటి వరకూ హిందూపురానికి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల వచ్చేసిందని,  శ్రీకంఠపురం పాఠశాల వద్ద దానిని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు నెలకొల్పి పూజలు చేసి, ఆ తర్వాత అతిగతీ లేకుండా చేశారు. డిగ్రీ కళాశాల నిర్మాణం జరగలేదు. జనాభా పరంగా ముస్లింలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉర్దూ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీని కూడా అటకెక్కించారు.   
  • నియోజకవర్గంలో చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు.  
  • స్థానికంగా వేలాదిగా ఉన్న ఫ్యాక్టరీ కార్మికులకు సత్వర మెరుగైన వైద్య సేవలు అందించేలా కార్మిక బీమా ఆస్పత్రి నెలకొల్పుతామన్న హామీ కూడా నెరవేరలేదు. ప్రస్తుతమున్న కార్మిక బీమా ఆస్పత్రిలో కనీస సదుపాయాలు కల్పించలేకపోయారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం లేదు.   

30 ఇయర్స్‌ ఇండస్ట్రీలో తిరోగమనం
టీడీపీకి ముందు.. టీడీపీకి తర్వాత అనే కోణంలో పరిశీలిస్తే హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి ఈ 30 సంవత్సరాల్లో పూర్తి తిరోగమణంలో పడింది. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో మురికి కాలువలు, వీధుల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. పలు వీధులు మురికి కూపాలను తలపిస్తున్నాయి. దోమలు, పందులు స్వైర విహారంతో ప్రజలు రోగాలపాలవుతున్నారు. పారిశ్రామిక ప్రగతి పడకేసింది. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యావంతులైన స్థానిక యువతీ యువకులు ఉపాధి అవకాశాలు వెదుక్కొంటూ పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. కనీస మౌలిక వసతుల్లేవు. 2014కు ముందు కన్నా ప్రస్తుతం తాగునీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది.  

ఇంకెన్నిరోజులీ లెజెండ్‌ పాలన 
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే చందంగా మారింది నియోజకవర్గ ప్రజల పరిస్థితి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆ పార్టీకే గుడ్డిగా ఓటు వేస్తూ వచ్చారు. బాలకృష్ణ ఐదేళ్ల పాలనలో టీడీపీ వైఖరి ఏమిటో నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. అభివృద్ధి కన్నా సొంత లాభమే తమకు ముఖ్యమంటూ సాగిన టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఇలాంటి తరుణంలోనే మార్పు కోసం పరితపిస్తున్నారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి టికెట్‌ కేటాయించకుండా 30 సంవత్సరాలుగా మోసం చేస్తూ వచ్చిన టీడీపీ మరోసారి ఈ స్థానాన్ని బాలకృష్ణకు కేటాయిండచంపై స్థానికులు భగ్గుమంటున్నారు.

పలకరిస్తే చెంప ఛెళ్లుమనిపించే ఎమ్మెల్యే తమకొద్దని.. ప్రేమాభిమానాలతో నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించేవారికే ఈ సారి పట్టం కడతామంటూ బాçహాటంగానే పేర్కొంటున్నారు. సెలబ్రేటీలను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం వల్ల వారి దరిదాపులకు కూడా వెళ్లలేక ఇంత కాలం ఇబ్బంది పడుతూ వచ్చారు. దీంతో ప్రజల కష్టాలు తెలిసిన వారికే ఈ సారి ఓటు వేస్తామంటున్నారు.     

మరిన్ని వార్తలు