దగ్గరికెళితే దబిడిదిబిడే

20 Mar, 2019 08:54 IST|Sakshi
‘ఇంటింటికీ తెలుగుదేశం’లో పాల్గొన్న ఓ కార్యకర్తపై చెయ్యిచేసుకుంటున్న ఎమ్మెల్యే బాలకృష్ణ (ఫైల్‌)

ముట్టుకుంటే చెంపఛెళ్లు దగ్గరికొస్తే చాచికొట్టడమే 

అభిమానులైనా, నేతలైనా ఒకే ట్రీట్‌మెంట్‌ 

హడలిపోతున్న జనం 

సాక్షి, హిందూపురం: ఆయన సినీహీరో...లెజెండ్‌...అలా అని అభిమానంతో దగ్గరకువెళ్తే చెంపఛెళ్లుమంటుంది. ఉత్సాహంగా సెల్ఫీకోసం ప్రయత్నిస్తే సెల్‌ఫోన్‌ పగిలిపోతుంది. ఆయన చేతికి, కాలికి ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ ముద్ర పడుతుంది. ఇక కాస్త దూరంగా ఉంటే వినలేని భాష సినిమా డైలాగుల్లా మార్మోగుతుంది. ఇదీ మన ఎమ్మెల్యే బాలకృష్ణ అలియాస్‌ బలయ్య వ్యవహార తీరు. అందుకే ఓటు వేసిన పాపానికి హిందూపురం వాసులంతా ఆయన బానిసల్లా బతికేస్తున్నారు. వచ్చినప్పుడల్లా తలో దెబ్బ వేసినా... మా బాబేనంటూ బయట సర్దుకుపోతున్నా...లోలోన తమకిలాంటి శాస్తి జరగాల్సిందేనని తమనుతామే తిట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన తరుణంలో మరెంతమందిపై ఆయన హస్త, పాదముద్రలు పడతాయోనని భయాందోళన చెందుతున్నారు. చివరకు సొంత పార్టీలోని సీనియర్‌ నేతలైనా బాలయ్య కనిపించగానే కాస్త దూరం జరుగుతున్నారు. 

బాలకృష్ణ చేసిన సన్మానాల్లో  మచ్చునకు కొన్ని ఇలా.. 

  • 2014లో హిందూపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలో దిగిన బాలకృష్ణ...కారుటాప్‌పై కూర్చుని ప్రచారం చేస్తూ ఓ కార్యకర్తను కాలితో తన్నాడు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. 
  • 2017 అక్టోబరు 3న హిందూపురంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా హిందూపురం మున్సిపాల్టీలోని 20వ వార్డు బోయపేటలో వెళ్తున్న సమయంలో మారుతి అనే అభిమాని ఎమ్మెల్యే బాలకృష్ణ పక్క నుంచి అతృతగా ముందువెళ్ల బోయాడు..అంతే బాలకృష్ణ టెంపర్‌ లేచింది. మారుతి చెంప చెళ్లుమనిపించేశాడు. ఈ సంఘటనలో అక్కడివారంతా విస్తుపోయారు. ఆ కార్యకర్తల కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారంతా సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లారు. ఈ సంఘటన తర్వాత బాలకృష్ణ పక్కన నడిచేందుకు కూడా నాయకులు, కార్యకర్తలు భయపడుతున్నారు.  
  • 2017 ఆగస్టులో నిర్వహించిన నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓహోటల్‌ వద్దకు వచ్చిన అభిమానులు బాలకృష్ణను గజమాలతో సన్మానించడానికి ప్రయత్నించారు. అభిమానులమధ్య తోపులాట జరిగింది. అంతే బాలకృష్ణ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అభిమానులను దుషిస్తూ ఒకరిపై చేయికూడా చేసుకున్నాడు. అభిమానంతో దండవేస్తామని వస్తే కొడతారేంటి అని అభిమానులే విమర్శలు గుప్పించారు. 
  • 2017 సెప్టెంబరు 30న విజయవాడలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ప్రారంభోత్సవంలోనూ వాయిస్‌ ఇవ్వాలని కోరిన మీడియాను బయటకు పోండి అంటూ చిర్రుబుర్రులాడారు.  
  • అలాగే సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులను కూడా మీరు మారరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  
  •  2018 మార్చి 3న ఖమ్మం జిల్లాలో విసృత్తంగా ప్రచారంలో భాగంగా మిట్టపల్లి గ్రామానికి వెళ్లిన బాలకృష్ణ కాన్వాయ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు. దీంతో బాలయ్య ఆగ్రహంతో ఊగిపోతూ వాహనం నుంచి కింది దిగి అక్కడున్న వారిపై చేయి కూడా చూసుకున్నారు. దీనిని జీర్ణించుకోలేని అభిమానులు టీడీపీ ఫ్లెక్సీలు తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే బాలయ్య బాధితులు ఎందరో ఉన్నారు. అయినా ఆయన పద్ధతి మారదు..అహం తొలగదు. అన్నట్లు మళ్లీ ఇపుడు ఎన్నికల ప్రచారం కోసం బాలయ్య హిందూపురం వస్తున్నారు. ఇప్పుడెంత మందిని కొడతాడో...మరెంతమదిని తిట్టిపోస్తాడోనన్న భయం ఆపార్టీ కార్యకర్తల్లో నెలకొంది.  
మరిన్ని వార్తలు