ఆర్టికల్‌ 370: వారిని చరిత్ర క్షమించబోదు!

17 Oct, 2019 15:07 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రతిపక్షాలు అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని, ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రతిపక్షాల మూర్ఖపు వాదనను, వారు చేస్తున్న హేళనను చరిత్ర గుర్తుంచుకుంటుందని, వారిని చరిత్ర క్షమించబోదని ఆయన అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీడ్‌ జిల్లా పర్లీలో గురువారం ఆయన ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారని, అదే సమయంలో కమలం కార్యకర్తల్లో ఉత్సాహం కొత్త పుంతలు తొక్కుతోందని ప్రధాని మోదీ అన్నారు.

పరాజయ నిరాశమయ దృక్పథంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఎలా సేవ చేయగలదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఓటర్ల మాదిరిగానే బీడ్‌ జిల్లా ఓటర్లు బీజేపీ వైపే ఉన్నారని, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించబోతున్నదని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎల్లుండితో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీల అగ్రనేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

>
మరిన్ని వార్తలు