ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ‘పెయిడ్‌’ డ్రామాలు

10 Sep, 2019 04:52 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న సుచరిత. చిత్రంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

చంద్రబాబుపై హోంమంత్రి సుచరిత ధ్వజం

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరిక

సాక్షి, అమరావతి: ఒకవైపు నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ, మరోవైపు వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు నచ్చడం లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. అందుకే పల్నాడులో పెయిడ్‌ ఆర్టిస్టులతో శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో కలసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ఫిర్యాదులకు వారంలోగా పరిష్కారం చూపాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గుంటూరు జిల్లాలో భౌతికదాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన గురవాచారి అనే వ్యక్తిని దారుణంగా హింసించారని గుర్తు చేశారు. మరో వ్యక్తిని రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారని, చంపేస్తామని బెదిరించారన్నారు. చంద్రబాబు దుర్మార్గమైన పాలనలో గుంటూరు జిల్లాలో 6 రాజకీయ హత్యలు జరగ్గా, అందులో 5 ఒక్క పల్నాడులో జరిగినవేనని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత పోలీసులు తీసుకున్న జాగ్రత్తల వల్ల ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదన్నారు. పల్నాడులో ఇప్పటివరకు 79 రాజకీయ పరమైన కేసులు నమోదుకాగా, అందులో టీడీపీ నేతలపై 43, వైఎస్సార్‌సీపీ నేతలపై 36 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సమావేశంలో ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్, గుంటూరు అర్బన్, రూరల్‌ ఎస్పీలు రామకృష్ణ, జయలక్ష్మీ పాల్గొన్నారు.

పల్నాడులో ఊరేగింపులకు అనుమతి లేదు
పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. ఎవరైనా రెచ్చగొట్టే పరిస్థితులు కల్పిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ర్యాలీలు నిర్వహించాలనుకొంటే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ప్రస్తు తం పల్నాడులో ఊరేగింపులకు అనుమతి లేదని, 144 సెక్షన్‌ కొనసాగుతోందన్నారు.

మరిన్ని వార్తలు