29 ఏళ్ల యువకుడు 29 ఏళ్ల బీజేపీని కూల్చాడు

15 Mar, 2018 11:00 IST|Sakshi
గోరఖ్‌ పూర్‌ ఉప ఎన్నికలో గెలిచిన ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌ (వృత్తంలో), సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (ఫైల్‌ ఫొటోలు)

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ఉప ఎన్నికల్లో 29వ నెంబర్‌ గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. 29 ఏళ్ల వయసున్న యువకుడు 29 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న బీజేపీకి ఎవరూ ఊహించని విధంగా బ్రేక్‌ వేశాడే అని. అవును.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒకప్పుడు గోరఖ్‌పూర్‌ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన సీఎం కావడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడి ఉప ఎన్నిక జరిగింది. అందులో బీజేపీ ఊహించని విధంగా ఓటమి పాలయింది. వాస్తవానికి అక్కడ గత 29 ఏళ్లుగా బీజేపీ పాలనకు అడ్డే లేకుండా పోయింది. మరే పార్టీ వ్యక్తి కూడా అక్కడ విజయం దక్కించుకోలేదు. పైగా ఇక్కడి గోరఖ్‌నాథ్‌ మఠంలోని పూజారులే ఎంపీలుగా గెలుస్తున్నారు. దీంతో సమాజ్‌వాది పార్టీ ప్రవీణ్‌కుమార్‌ నిషాద్‌ అనే యువకుడిని రంగంలోకి దింపింది.

బీఎస్‌పీ మద్దతు కూడగట్టింది. ఆశ్చర్యం ఏమిటంటే అతడి వయసు కూడా 29 ఏళ్లు. నిషాద్‌ను ఎన్నికల్లో దింపే వరకు కూడా అతడు పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో 29 ఏళ్ల యువకుడు 29 ఏళ్ల గోరఖ్‌పూర్‌లోని బీజేపీ సామ్రాజ్యాన్ని కూలదోశాడంటూ చర్చ సాగుతోంది. 1998 నుంచి ఇక్కడ యోగి విజయం సాధిస్తున్నారు. దాంతో ఎవరికీ తెలియని నిషాద్‌తో పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదని బీజేపీ వర్గాలు ఊహించగా అనుకోని విధంగా అతడు విజయభావుటా ఎగరేశాడు.

ఈ విజయం యోగికి, బీజేపీకి ఊహించన షాక్‌ కాగా సమాజ్‌ వాది పార్టీ కూడా తీవ్ర ఆశ్చర్యంలో మునిగిపోయిందట. అసలు వారు ఊహించకుండానే విజయం వచ్చి వాలిందని సమాజ్‌వాది పార్టీ నేతలు అంటున్నారు. ఇక నిషాద్‌ గురించి పరిశీలిస్తే అతడు లక్నోలోని గౌతం బుద్ద యూనివర్సిటలో ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశాడు. 2011లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. అతడిపై ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదు. అఫిడవిట్‌ ప్రకారం అతడి ఆస్తులు రూ.11లక్షల లోపే. అందులోను రూ.99,000 లోన్‌ కూడా ఉంది. అతడి భార్య ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరిన్ని వార్తలు