‘పుల్వామా’ను రాజకీయం చేయడం కాదా?!

20 Feb, 2019 14:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘కశ్మీర్‌ లోయలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం స్వేచ్ఛగా సంచరించిందంటే ఇది కచ్చితంగా ఇంటెలిజెన్స్‌ వర్గాల వైఫల్యమే’ అని 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే, శుక్రవారం నాడు జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్య ఇది. అదే రోజు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించగా, ఈ విషయంలో ఏ నిర్ణయానికైనా ప్రభుత్వానికి అండగా ఉంటామని యావత్‌ ప్రతిపక్షం ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవడం గమనార్హం. (‘పుల్వామా’ సూత్రధారి ఫొటో మార్ఫింగ్‌)

పుల్వామా దాడి సంఘటనను తాము రాజకీయం చేయదల్చుకోలేదని, అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నామని బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడు ప్రకటించింది. ఆ మేరకు శుక్రవారం ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో జరగాల్సిన తన సభలను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రద్దు చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సిలో జరగాల్సిన తన సభను కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  రద్దు చేసుకున్నారు. అయితే అదే రోజు ఝాన్సీలో జరగాల్సిన బహిరంగ సభను మాత్రం మోదీ రద్దు చేసుకోలేదు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం కోసం వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలిపించండంటూ ఆ సమావేశంలో మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

మోదీ శనివారం మహారాష్ట్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించడంతోపాటు పల్వామా సంఘటన గురించి ప్రస్తావించి ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించారు. అదివారం అస్సాం ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ ‘ కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కనుక జవానుల ప్రాణ త్యాగాన్ని వృధా పోనీయం’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్‌ బీజేపీ నాయకుడు భరత్‌ పాండ్యా సోమవారం నాడు వడోదరలో మాట్లాడుతూ కేంద్రంలో ఇంతకుముందున్న మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జాతీయ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోక పోవడం వల్ల నేడు జవాన్ల ప్రాణాలు పోయాయని అన్నారు. ‘నేడు జాతీయవాదాన్ని నింపుకున్న హృదయాలతో యావత్‌ జాతి ఐక్యంగా నిలబడింది. ఈ ఐక్యతను ఓట్లుగా మలుచుకోవడం మన బాధ్యత’ అని పాండ్య పిలుపునిచ్చారు.

సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా దేశంలోని బీజేపీ ముఖ్యమంత్రులను, రాష్ట్ర మంత్రులను బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడే ఆదేశించింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసింది. నిరసన సభల్లో పార్టీ జెండాలకు బదులుగా పార్టీ ఎన్నికల గుర్తయిన కమలాన్ని ఎక్కువ ప్రదర్శించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.

శవం పక్కన చిద్విలాసంగా బీజేపీ ఎంపీ
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో శనివారం నాడు సీఆర్‌పీఎఫ్‌ జవాను అజిత్‌ కుమార్‌ అంతిమ యాత్రలో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ పాల్గొన్నారు. తాను అంతిమ యాత్రలో పాల్గొంటున్నానని, పైగా సైనికుడి భౌతికకాయం పక్కనున్నననే విషయాన్ని కూడా విస్మరించిన బీజేపీ ఎంపీ, పార్టీ ర్యాలీలో పాల్గొన్నట్లుగా చిద్విలాసంగా నవ్వుతూ ప్రజలకు అభివాదం చేస్తూ, చేతులూపుతూ వెళ్లారు. దీనిపై సోషల్‌ మీడియాలో కూడా విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తాయి. పుల్వామా ఉగ్ర దాడికి సంబంధించి అనేక వైఫల్యాలు వెలుగులోకి వచ్చిన వాటిపై చర్య తీసుకోవాల్సిందిగా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇదే విషయమై ఆ పార్టీ సీనియర్‌ నేతలను ప్రశ్నించగా, బీజేపీకి ప్రచార బలగాలు ఎక్కువున్నాయని, ఈ సమయంలో తాము ఏం మాట్లాడినా ‘జాతి వ్యతిరేకులు’ అంటూ ముద్ర వేసే ప్రమాదం ఉందని వారన్నారు. ఈ విషయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా