పొలిటికల్‌ స్ర్కీన్‌ : ఎవరు హిట్‌..ఎవరు ఫట్‌ ?

24 May, 2019 15:11 IST|Sakshi

ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎన్నికల క్షేత్రంలో తలపడి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెరపైన నవరసాలు పలికించే నటుల్లో కొందరు గెలుపు బాట పట్టగా, మరికొందరికి ఓటమి ఎదురైంది. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో సన్నీ డియోల్‌ బీజేపీలో చేరి గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభ బరిలో నిలిచి గెలిచి పొలిటికల్‌ స్క్రీన్‌పైనా తనకు తిరుగులేదనిపించారు. డ్రీమ్‌ గర్ల్‌గా ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన హేమమాలిని వరుసగా రెండో సారి విజయం సాధించారు.

మధుర లోక్‌సభ స్ధానం నుంచి హేమ మాలిని ఆర్‌ఎల్డీ అభ్యర్ధి కున్వర్‌ నరేంద్ర సింగ్‌పై మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఎన్నికల ముందు కాషాయ పార్టీలో చేరి ఆపార్టీ తరపున రాంపూర్‌ లోక్‌సభ స్ధానం​నుంచి బరిలో దిగిన మరో నటి జయప్రద ఎస్పీకి చెందిన ఆజం ఖాన్‌ చేతిలో లక్ష ఓట్లకు పైగా తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక 1990 ప్రాంతంలో బాలీవుడ్‌లో మెరిసిన ఊర్మిళా మటోండ్కర్‌ ముంబై నార్త్‌ నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో మట్టికరిచారు.

పలు బాలీవుడ్‌, దక్షిణాది చిత్రాల్లో నటుడిగా రాణించిన ప్రకాష్‌ రాజ్‌ బెంగళూర్‌ సెంట్రల్‌ స్ధానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి కేవలం 28,906 ఓట్లనే తెచ్చకోగలిగి భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. మరోవైపు శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హా ఎస్పీ అభ్యర్ధిగా లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో తలపడి ఓటమి పాలయ్యారు. ఇక ఆమె భర్త, బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన శత్రుఘ్న సిన్హా పట్నాసాహిబ్‌ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చేతిలో ఓడిపోయారు.

మరో బాలీవుడ్‌ నటుడు రాజ్‌బబ్బర్‌ యూపీలోని ఫతేపూర్‌ సిక్రీ స్ధానం నుంచి కాంగ్రెస్‌ తరపున బరిలో నిలిచి దాదాపు ఐదు లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. బాలీవుడ్‌, భోజ్‌పురి నటులు రవికిషన్‌, మనోజ్‌ తివారీలు సైతం బీజేపీ తరపున పోటీ చేసి తమ ప్రత్యర్ధులను చిత్తుచేశారు.

మరిన్ని వార్తలు