బీజేపీ తొత్తులు ఏం సమాధానం చెబుతారు..?

3 Apr, 2018 12:06 IST|Sakshi
గోరంట్ల బుచ్చయ్య చౌదరి

సాక్షి, అమరావతి : దేశ రక్షణ కోసం కొనుగోలు చేస్తున్న విమానాల్లోనూ అవకతవకలు జరిగాయని టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.1650 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రాఫెల్  ఒప్పందంలో రూ. 28 వేల కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో బీజేపీ వాటా ఎంతని ప్రశ్నించారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

‘గుజరాత్ రాష్ట్రంలో జీఎస్పీఎల్ పెట్టి ఆ రాష్ట్రాన్ని మోసం చేయలేదా..? నష్టాల్లో ఉన్న జీఎస్పీఎల్ సంస్థను ఓఎన్‌జీసీకి ఎలా కట్టబెట్టారు..? జీఎస్పీఎల్ ఒప్పందంలో వచ్చిన డబ్బుతో గుజరాత్ ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నది వాస్తవం కాదా..? రాష్ట్రానికి చేసే న్యాయం చేయకపోగా టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తారా..?  ఈ విషయాలపై స్థానిక బీజేపీ తొత్తులు ఏం సమాధానం చెబుతార’ని ప్రశ్నించారు.  

కనీస ఇంగితం లేకుండా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను బీజేపీ జేబులో నుంచి అడగడం లేదని, తన పబ్బం గడుపుకోవడం కోసం ప్రాంతీయ తత్వాన్ని బీజేపీ రెచ్చగొడుతోందని విమర్శించారు. అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేసి లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి బీజేపీ నేతల కళ్లకు కనపడడం లేదా..? అని ఎద్దేవా చేశారు. సెస్సుల ద్వారా వస్తోన్న డబ్బును సక్రమంగా వినియోగించడం లేదని ధ్వజమెత్తారు. రైతు రుణ మాఫీకి నిధులు ఇవ్వని మోదీ, బ్యాంకులను దోచుకుంటోన్న వారిని రక్షిస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు.

మరిన్ని వార్తలు