ప్రియాంక, ఇవాంక అవుతారా?

13 Mar, 2019 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మీ ఓటే మీ ఆయుధం. ఆ ఆయుధం ఎవరినో గాయపర్చడానికో, మరెవరినో బాధ పెట్టడానికో కాదు. మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికే ఆ ఆయుధం. ఎవరైతే మీకు అది చేస్తామని, ఇది చేస్తామని చెబుతారో వారిని నిలదీయండి, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా ? అని, మీ బ్యాంకు ఖాతాల్లో వేస్తానన్న 15 లక్షల రూపాయలు ఎక్కడికి పోయాయో అడగండి!’ అని కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక ప్రియాంక గాంధీ మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన సభలో పిలుపునిచ్చారు. బీజేపీ అంటే ప్రజల మధ్య విద్వేషాలను పెంచే పార్టీ అని, కాంగ్రెస్‌ అంటే ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచే పార్టీ అంటూ రాహుల్‌ గాంధీ మాటలను కూడా పునరుద్ఘాటించారు. మొత్తం ఏడు నిమిషాల్లో ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

ఉత్తర ప్రదేశ్‌ (తూర్పు) కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు స్వీకరించాక ప్రియాంక చేసిన మొదటి ప్రసంగం ఇదే! అయినా ఆమె ఎక్కడా తడబడలేదు. చెప్పదల్చుకున్న నాలుగు మాటలను ముక్కుసూటిగా, అందరికి అర్థం అయ్యేలా స్పష్టంగా మాట్లాడారు. అదే రాహుల్‌ గాంధీ స్పష్టంగా, గుక్క తిప్పుకోకుండా మాట్లాడడానికి చాలా కాలమే పట్టింది. ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 14వ తేదీన తన సోదరుడు రాహుల్‌ గాంధీతో కలిసి లక్నోలో పర్యటించారు. ఆ రోజున స్థానిక ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆ రోజునే ఆమె అక్కడ తన తొలి ప్రసంగం ఇవ్వాల్సి ఉండింది. అయితే పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది సైనికులు మరణించడంతో ఆమె తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకొని.. యాత్రను నిర్వహించారు.

ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే రాహుల్‌ గాంధీ తెర మరుగయ్యే ప్రమాదం ఉంటుందని, ఆమె భర్త రాబర్ట్‌ వాడ్రాపై అనేక కేసులు నమోదైనందున ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం లేదన్న వాదనలు గతంలో వినిపించాయి. రాహుల్‌ గాంధీకి రాజకీయ పరిణితి రావడంతో ఆయనకు తోడుగా ప్రియాంక రంగప్రవేశం చేశారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. యూపీలో బీఎస్పీ, ఎస్పీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఏమేరకు రాణించగలరన్నది ప్రస్తుతానికి ప్రశ్నే! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు రాజకీయ సలహాదారుగా రంగప్రవేశం చేసి విజయం సాధించిన ఆయన కూతురు ఇవాంకలా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్తగా, రాహుల్‌ గాంధీకి చేతోడుగా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక తప్పకుండా విజయం సాధిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు ఆశిస్తున్నాయి.

మరిన్ని వార్తలు