వేడెక్కుతున్న రాజకీయం

16 Feb, 2019 09:33 IST|Sakshi

నెలాఖరుకు రానున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

ఆదిలాబాద్, పెద్దపల్లికి పెరుగుతున్న ఆశావహులు

టీఆర్‌ఎస్‌లో మారుతున్న సమీకరణాలు

ఆదిలాబాద్, పెద్దపల్లి కాంగ్రెస్‌ సీట్లకు భారీగా దరఖాస్తులు

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల చూపు పెద్దపల్లి వైపు

నాయకత్వ లోపంతో ముందుకు కదలని బీజేపీ 

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఈనెలాఖరు లోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో రాజకీయం వేడెక్కుతోంది. పార్లమెంటు ఎన్నికలను జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలా బాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలపై కన్నేసిన ఆయా పార్టీల నేతలు టికెట్ల కోసం పావులు కదుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు పెద్దపల్లి జిల్లాలో విస్తరించిన ఈ రెండు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో హోరాహోరీ పోరు సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు సీట్లలో పెద్దపల్లి ఇప్పటికే ఖాళీ అయింది. ఇక్కడి ఎంపీ బాల్క సుమన్‌ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేశారు. పెద్దపల్లి టికెట్టు సాధించేందుకు టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిత్వానికి 15 వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇక ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎంపీ గోడెం నగేష్‌ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ను కాదని సీటు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఎంపీ సీట్లు రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టిస్తున్నాయి. 

ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్టు రేసులో శ్యాంనాయక్, కోవ లక్ష్మి
ఆదిలాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీ జి.నగేష్‌ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివాదరహితుడిగా పేరున్నప్పటికీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బోథ్‌ టికెట్టు ఆశించి భంగపడ్డారు. బోథ్‌లో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుకు సహకరించలేదు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, ఖానాపూర్‌లలో కూడా ఆయన దృష్టి పెట్టలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రాథోడ్‌ బాపూరావు, రేఖానాయక్‌తోపాటు ఆసిఫాబాద్‌లో ఓడిపోయిన కోవ లక్ష్మి కూడా నగేష్‌ను వ్యతిరేకిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి సీటిచ్చినా గెలిపించుకోవాలనే ధోరణితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్టు కోసం తాజాగా జిల్లా రవాణా శాఖ అధికారి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త అజ్మీరా శ్యాంనాయక్‌ పేరు వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, ప్రస్తుతం గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఆయన గత ఎన్నికల్లో కూడా టికెట్టు ఆశించి భంగపడ్డారు. నగేష్‌ను మార్చాలని పార్టీ భావిస్తే ప్రత్యామ్నాయంగా శ్యాంనాయక్‌కు సీటు లభిస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ తరఫున శ్యాంనాయక్‌ గురించి నివేదిక తెప్పించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ఆదివాసీలకే సీటివ్వాలని భావిస్తే మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రేసులో ఉంటారు. ఆదివాసీ మహిళగా సీటు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. 

పెద్దపల్లిలో ‘పెద్ద’లకు చాన్స్‌?
పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో మాజీ ఎంపీ వివేక్‌ టికెట్టు రేసులో ముందున్నట్లు కనిపిస్తున్నా, ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచిన, ఓడిన ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. ఆయనకు సీటిస్తే ఒప్పుకునేది లేదని వీరంతా తెగేసి చెపుతుండడంతో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని టీఆర్‌ఎస్‌ వర్గాలు చూస్తున్నాయి. అదే సమయంలో పెద్దపల్లి సీటును మల్లెపల్లి లక్ష్మయ్య, గంటా చక్రపాణిల పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన వీరిలో ఒకరికి అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. వీరు కాకుండా మాజీ ఎ మ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట ప్రవీణ్‌ కుమార్‌ కూడా తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. 

కాంగ్రెస్‌లో రెండు చోట్ల హేమాహేమీలు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఆసిఫాబాద్, పెద్దపల్లిలో మంథని స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌ దక్కించుకుంది. అయినా పెద్దపల్లిలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌కు ధీటుగా ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్‌లో ఆదిలాబాద్, ముథోల్‌ స్థానాల్లో ఆ పార్టీకి మూడో స్థానం దక్కడంతో ఓట్ల శాతం తగ్గింది. కాగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉందని భావిస్తున్న 8 సీట్లలో ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి స్థానం కోసం ఇప్పటికే సుమారు 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఆరెపల్లి మోహన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, 2009లో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్, అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ బంధువు మన్నె క్రిశాంక్, కవ్వంపల్లి సత్యనారాయణ, దుర్గా భవాని, గుమ్మడి కుమారస్వామి, ఊట్ల వరప్రసాద్‌ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. చెన్నూరు నుంచి పోటీ చేసిన వెంకటేశ్‌ నేత టీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక ఆదిలాబాద్‌ నుంచి మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, గత ఎన్నికల్లో పోటీ చేసిన నరేష్‌ జాదవ్‌ టికెట్టు ఆశిస్తున్నారు. వీరు కాకుండా గిరిజన మహిళ కోటాలో చారులత రాథోడ్‌ టికెట్టు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. సిర్పూరు నియోజకవర్గానికి చెందిన సిడాం గణపతి, ఖానాపూర్‌కు చెందిన రవినాయక్, కరీంనగర్‌కు చెందిన జాన్సన్‌ నాయక్‌లు సైతం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ఇక్కడ ఆదివాసీ, లంబాడ వర్గాలలో ఎవరికి సీటు ఇవ్వాలనే అంశంతో పాటు ఆర్థిక వనరులు కూడా టికెట్టు విషయంలో ప్రధానం కానున్నాయి.

బీజేపీలో పోటీ ఉన్నా... స్పందన లేని అగ్ర నాయకత్వం
బీజేపీ నుంచి ఆదిలాబాద్, పెద్దపల్లి సీట్ల కోసం నాయకులు పోటీ పడుతున్నా, పార్టీ అధిష్టానం నుంచి తగిన స్పందన లేనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్, ఖానాపూర్‌లలో గత శాసనసభ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించడంతో ఇక్కడ టికెట్టు కోసం పోటీ తీవ్రంగానే ఉంది. ఖానాపూర్‌ నుంచి పోటీ చేసి 20వేల పైచిలుకు ఓట్లు సాధించిన సట్ల అశోక్‌ టికెట్టు రేసులో ముందున్నారు. ఇక బోథ్‌లో పోటీ చేసిన మడావి రాజు, మాజీ మంత్రి అమర్‌సింగ్‌ తిలావత్, ఆడె మానాజీ, శ్రీరాం నాయక్‌లు సైతం టికెట్టు ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య టికెట్టు ఆశిస్తున్నారు. ఆయనతో పాటు బెల్లంపల్లి, చెన్నూరు నుంచి పోటీ చేసిన కొయ్యల ఏమాజీ, అందుగుల శ్రీనివాస్‌ తదితరులు కూడా టికెట్టు ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధమేనని చెపుతున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు