ముగింపునకు ముందు రోజు పోటెత్తిన జనం 

9 Jan, 2019 03:11 IST|Sakshi

పాదయాత్ర మార్గంలో బారులు తీరిన అక్కచెల్లెమ్మలు  

వైఎస్‌ జగన్‌తో సెల్ఫీల కోసం గంటల తరబడి నిరీక్షణ  

పాదయాత్ర దారి వెంట యువత ఆనందంతో కేరింతలు 

ప్రతిపక్ష నేతతో కష్టాలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు 

మన ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని జగన్‌ భరోసా 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకున్న తరుణంలో జనాదరణ మరింతగా పెరిగింది. తండోపతండాలుగా ప్రజలు ఆయనకు సంఘీభావం పలకడానికి వస్తున్నారు. పాదయాత్ర 340వ రోజు మంగళవారం జగతి, తుత్తుడిపుట్టుగ క్రాస్, వరపుట్టుగ క్రాస్, రాజపురం మీదుగా.. అగ్రహారం వరకూ సాగింది.  

చలిని సైతం లెక్క చేయక.. 
ఆయన వెళ్లే దారి పొడవునా గ్రామాల ప్రజలు, చుట్టు పక్కల నుంచి వచ్చే వారితో రోడ్లన్నీ బారులు తీరాయి. అక్కచెల్లెమ్మలు ఆయన కోసం గంటల తరబడి వేచి ఉండి సెల్ఫీల కోసం ఆరాటపడ్డారు. ఉదయం ఆయన శిబిరం నుంచి రోడ్డుపైకి రావడానికి రెండు గంటల ముందే జనం అక్కడికి చేరుకోవడం మొదలెట్టారు. ఉదయం పూట చలిగా ఉన్నా.. లెక్కచేయకుండా ప్రజలు తరలివచ్చారు. తన కోసం వచ్చిన వారిని వైఎస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. పాదయాత్ర ముగింపునకు ఇక ఒక్క రోజే మిగిలి ఉండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన్ను కలుసుకోవడానికి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. బుధవారం జరగనున్న పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన వారు సైతం ప్రతిపక్ష నేత వద్దకు రావడంతో పాదయాత్ర సాగుతున్న ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకొన్నారు. మరికొందరు వినతిపత్రాలిచ్చారు. జన్మభూమి కమిటీల దాష్టీకాలపై ఫిర్యాదులు చేశారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అంతా మంచి జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. 

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపునకు ఒక రోజు ముందు మంగళవారం కూడా పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. 

గూడూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, పలువురు టీడీపీ నేతల చేరిక 
శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లాలోని గూడూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పొణకా దేవసేనమ్మ.. టీడీపీకి రాజీనామాచేసి వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆమెతో పాటు పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు, మండల స్థాయి నేతలు భారీగా టీడీపీలోంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. పాదయాత్ర మధ్యాహ్న శిబిరం వద్ద వారంతా ప్రతిపక్ష నేతను కలుసుకుని పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వెల్లడించడంతో వారికి జగన్‌.. కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు గోవిందు మస్తానమ్మ, బైనా భానుప్రకాష్, పోసిన రాజేశ్వరమ్మ, షేక్‌ షంషీర్, కోడిపర్తి కల్పన, బండి విజయమ్మ, నేరేళ్ల సుబ్బమ్మ, ముప్పాళ్ల లక్ష్మి, బాలిబోయిన రమేష్, మనపాటి రవీంద్రబాబు, గూడూడు మండల ఎంపీపీ పిట్టి రావమ్మ, దివిపాలెం సర్పంచ్‌ పిట్టి దేవసేన తదితరులున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పాలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, పార్టీ గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్, శీకిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవసేనమ్మ, ఆమె అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరడంతో గూడూరు నియోజకవర్గంలో టీడీపీ సగం ఖాళీ అయినట్లేనని చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే బడుగు, బలహీనవర్గాలకు మేలు జరుగుతుందని భావించి తామంతా పార్టీలో చేరినట్టు చైర్‌పర్సన్‌ దేవసేనమ్మ మీడియాతో చెప్పారు. 

బుద్దా నాగేశ్వరరావు చేరిక.. వెంకన్నకు షాక్‌ 
విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవిల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు మంగళవారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రతిపక్ష నేత.. ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు స్వయానా సోదరుడు. జగన్‌ ప్రకటించిన సంక్షేమ పథకాలతో బీసీలకు మేలు జరుగుతుందని,  బుద్దా వెంకన్న ఏనాడూ బీసీలను పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్‌ హయాంలో బీసీలకు జరిగిన మేళ్లను ఆయన గుర్తు చేశారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ను రూపొందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారని చెప్పారు.

వైఎస్సార్‌ సీపీలోకి మాజీ కార్పొరేటర్‌
కృష్ణా జిల్లా విజయవాడ వెస్ట్‌ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ కృష్ణా జిల్లా ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు బొత్స అప్పలనర్సయ్య, మల్లాది విష్ణుల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ యలకల చలపతిరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చలపతిరావుతో పాటు కర్ణాటి శివశంకర్, మద్ది నాగరాజు, చుక్కా పోలారెడ్డి, తాతా శ్రీను తదితరులున్నారు.

నా బిడ్డకు ప్రాణం పోసిన మిమ్మల్ని మరువలేమన్నా..  
అన్నా.. నా బిడ్డ లోకేశ్‌నాగమణికంఠకు ప్రాణం పోసిన మీ మేలును జీవితాంతం మరవలేం.. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నా ఏకైక కుమారుడికి బ్రైన్‌ట్యూమర్‌ రావడంతో తీవ్ర ఆవేదన చెందా. ఈ క్రమంలో పాదయాత్రగా వస్తున్న జగనన్నను కలిసి నా బిడ్డ సమస్యను వివరించగానే స్పందించిన రాజన్న బిడ్డ.. రూ.6 లక్షల విలువైన ఆపరేషన్‌ను తిరుపతి ఆస్పత్రిలో ఉచితంగా చేయించి నా బిడ్డకు పునర్జన్మ ప్రసాదించారు.  
– వైఎస్‌ జగన్‌ను కలిసిన తర్వాత మాట్లాడుతున్న పి.వెంకటరాంబాబు, ఎస్‌.సీతాపురం, దెందులూరు, పశ్చిమగోదావరి జిల్లా 

ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. 
ఈ ప్రాంతంలో మత్స్య సంపద అధికంగా ఉన్నా తగినన్ని సౌకర్యాల్లేవు. దీంతో ఇతర ప్రాంతాలకు వ్యాపార, జీవనోపాధి కోసం వలసపోతున్నాం. అక్కడ మేం ప్రాణాలు కోల్పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల సోంపేట మండలం గొల్లగండి గ్రామానికి చెందిన మడ్డు మోహనరావు చెన్నైలో మరణించినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సమస్యల పరిష్కారానికి మీరు చర్యలు తీసుకోండి. ఈ జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయించి మమ్మల్ని ఆదుకోండి.  
– ఎం.వెంకటేష్, ఇస్కలపాడు, సోంపేట మండలం

కిడ్నీ రోగులకు మేలు చేయండన్నా..
అన్నా.. మా ప్రాంతంలో కిడ్నీ రోగులు అధికం. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ మహమ్మారికి బలైపోతున్నారు. ఈ రోగం ఎందుకొస్తుందో అర్థం కావడం లేదు. వైద్యానికి డబ్బుల్లేక ఎంతోమంది మరణిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 5 వేల మంది చనిపోయారు. మీరు అధికారంలోకొచ్చాక ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోండన్నా..  
– బొర్ర శ్రావ్యశ్రీ,.. ఎమ్మెస్సీ విద్యార్థిని, బొర్రపుట్టుగ, ఇచ్ఛాపురం నియోజకవర్గం 

మరిన్ని వార్తలు