అవ్వా పోయె.. బువ్వా పోయె

24 May, 2019 06:11 IST|Sakshi

నలుగురు మంత్రుల సహా 14 మంది దారుణ ఓటమి 

వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలు 

వీరిలో ఇద్దరు మృతి 

15 మందికి  సీట్లిచ్చిన చంద్రబాబు.. గెలిచింది ఒక్కరే  

వైఎస్సార్‌సీపీ నుంచిఎన్నికై ధనకాంక్షతో, సొంత ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన 21మంది ఎమ్మెల్యేలు తమ పాపాలకు ఫలితం అనుభవించారు. తమ దుష్టపాలనకు దన్నుగా వీరిని పార్టీలో చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ వీరిలో ఆరుగురికి సీట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరమైంది. గెలుపు గుర్రాలవుతారని ఆశించి 15 మందికి సీట్లు కేటాయించగా వారిలో 14 మందిని ఇంటిబాట పట్టించారు ఓటర్లు. 

సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన పలువురు నేతలకు ఈ ఎన్నికల్లో చావు దెబ్బ తగిలింది. 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మరణించగా మిగిలిన వారిలో 15 మందికి చంద్రబాబు సీట్లిచ్చాడు. వీరిలో కిడారి తనయుడు కూడా ఉన్నాడు. అయితో వీరిలో 14 మంది ఘోరంగా ఓటమిపాలయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా చంద్రబాబు కేబినెట్‌లో ఉన్న నలుగురు మంత్రులు ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు, అమర్‌నాథ్‌రెడ్డిలు ఓడిపోయారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకట రమణ, పాడేరులో గిడ్డి ఈశ్వరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ, రంపచోడవరంలో వంతల రాజేశ్వరి, పామర్రులో ఉప్పులేటి కల్పన, విజయవాడ పశ్చిమలో జలీల్‌ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్, కందుకూరులో పోతుల రామారావు, గిద్దలూరులో అశోక్‌రెడ్డి, గూడూరులో సునీల్‌కుమార్, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డిలను అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఫిరాయింపుదారుల్లో ప్రకాశం జిల్లా అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్‌ ఒక్కరే గెలిచారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వీరి పట్ల ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఫలితాల్లో స్పష్టమైంది.
 
ప్రలోభాలతో 23 మందిని టీడీపీలో చేర్చుకున్న బాబు  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అస్థిరపరిచే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో భూమా నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు కొంతకాలానికి మరణించారు. మిగతావారిలో అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, అమర్‌నాథ్‌రెడ్డిలను ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా చంద్రబాబు తనకు నైతిక విలువలు లేవని నిరూపించుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో గెలిచిన వీరంతా టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆయనపై ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. జగన్‌ చలవతో ఎమ్మెల్యే అయిన ఆదినారాయణరెడ్డి ఆయన్ను ఇష్టానుసారం దూషిస్తూ చంద్రబాబుకు దగ్గరయ్యారు. చివరికి చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటివ్వకుండా కడప ఎంపీ సీటివ్వగా అక్కడ దారుణంగా ఓడిపోయారు. మిగిలిన వారిని కూడా ఇదే రీతిలో ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా జగన్‌మోహన్‌రెడ్డి పోరాడినా చంద్రబాబు దాన్ని వక్రీకరించి నానా యాగీ చేశారు.

అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఫిరాయింపుదారులపై వేటు వేయకుండా కాపాడి చంద్రబాబు పట్ల స్వామిభక్తిని చాటుకున్నారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తినా ఆయన అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరించారు. చివరికి ఫిరాయింపులకు వ్యతిరేకంగా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే దాన్ని వక్రీకరించి ఆరోపణలు చేశారు. అసెంబ్లీకి రావడంలేదని, అధికారపక్షానికి భయపడి పారిపోయారని రకరకాలుగా అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ప్రతి వైఖరినీ ఇలాగే వివాదం చేసి లబ్ది పొందాలని చూసిన చంద్రబాబు ఫిరాయింపులను సమర్థించుకుని అభాసుపాలయ్యారు. మళ్లీ వారికి ఎన్నికల్లో సీట్లిచ్చినా ప్రజలు మాత్రం ఓడగొట్టి ఇంటికి పంపించారు.  

మరిన్ని వార్తలు