గ్రామ స్వరాజ్యం జగన్‌ వల్లే సాధ్యం

3 Oct, 2018 04:38 IST|Sakshi
కొండవెలగాడలో వైఎస్‌ జగన్‌ వెంట అడుగులేస్తున్న జనవాహిని

గాంధీ జయంతి వేళ ప్రజల మనోగతం 

సర్కారోళ్లు వేధిస్తున్నారయ్యా.. అని వాపోయిన జనం 

బాబు పాలనలో కష్టాలు తప్ప ఏమున్నాయ్‌.. 

ప్రతి పల్లె గడపలో కన్నీటి గాథలే 

భద్రతకు భరోసా లేని ఉద్యోగులు 

దగాకు గురైన రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు 

జననేతకు కష్టాలు చెప్పుకోవాలని తరలి వచ్చిన వైనం 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పలకరించే జనం.. పరుగులు పెట్టే అభిమానం.. ఉరకలేసే ఉత్సాహం.. ప్రతి పల్లెలోనూ ఇదే సందడి. ప్రతి మనసులోనూ ‘అన్నొస్తున్నాడు’ అనే ఆనందం.. పుట్టెడు కష్టాలు చెప్పే వాళ్లు.. గుండె లోతుల్లోంచి ఆప్యాయతను పంచే ప్రజానీకం.. పూలబాటలు.. మంగళహారతులు.. ఇవీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 276వ రోజు మంగళవారం నాడు కనిపించిన దృశ్యాలు. ఇంతటి ఆప్యాయతల మధ్య.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం జననేత వల్లే సాధ్యమని అన్ని వర్గాల వారూ ఆకాంక్షించారు. విజయనగరం పట్టణం కొత్తపేట నుంచి ఉదయం ప్రారంభమైన పాదయాత్ర కొత్తపేట సంకేటివీధి, ఆరవవార్డులో కుమ్మరివీధి, వైఎస్సార్‌ నగర్, కొండకరకాం క్రాస్‌ మీదుగా కొండవెలగాడ వరకు సాగింది. ‘రాజన్న బిడ్డ మా కోసమొస్తున్నాడు’ అంటూ ప్రజలు పరవశించి పోవడం కన్పించింది. పాదయాత్ర సాగిన రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయి. దీనికి తగ్గట్టు మండుటెండ.. ఉక్కపోత. జనం ఇవేవీ లెక్కచేయ లేదు. అడుగు కూడా ఖాళీ కన్పించనంతగా జనం కిక్కిరిసిపోయారు. తమనేతను కలవాలని, కష్టాలు చెప్పుకోవాలని పోటీపడ్డారు. ఆయన రాకకోసం గంటల తరబడి నిరీక్షించారు. కిలో మీటర్ల కొద్దీ క్యూ కట్టారు. మేడలు, చెట్లు, గోడలు, స్తంభాలు.. ఎక్కారు. అక్కడి నుంచి జగన్‌ స్పష్టంగా కన్పించారంటూ సంతోషించారు.  

బాపూజీకి నివాళి 
జగన్‌ బస చేసిన శిబిరం వద్ద గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందే వైఎస్‌ జగన్‌.. గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకూ నివాళులర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లటి దుస్తుల్లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి బయటికొస్తున్న జగన్‌ను చూస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన్ను చుట్టముట్టి గాంధీ కలలు గన్న రాజ్యం మీ వల్లే సాధ్యమంటూ ఉద్వేగంగా నినదించారు. బాపూజీ కోరిన గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చూశాం.. మళ్లీ జగన్‌ వస్తేనే ఆ మంచి రోజులొస్తాయని విజయనగరానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు నర్సన్నరాజు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలోనే స్థానిక పాత్రికేయ సంఘాల నేతలు కలిశారు. అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమానికి చేయతనివ్వాలని కోరారు. 

నాలుగున్నరేళ్లుగా కన్నీళ్లే.. 
మధ్యాహ్న భోజన పథకం ఉద్యోగులు జగన్‌ను కలిశారు. చంద్రబాబు చేస్తున్న దగా చెప్పుకుని బావురుమన్నారు. జీతాలివ్వడం లేదని, మెస్‌ బిల్లులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారని వాపోయారు. తాళి పుస్తెలు కదువపెట్టి భోజనం పెడుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. 108 ఉద్యోగులు వారి ఆవేదనను జననేత ముందుంచారు. వైఎస్సార్‌ కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు, యువకులు కాలనీ మొత్తం ఆయన వెంటే నడిచింది. వైఎస్సార్‌ ఇళ్లు కట్టించడంతో కృతజ్ఞతగా తమ కాలనీకి వైఎస్సార్‌ కాలనీ అని పేరు పెట్టుకున్నందుకు టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తోందో వివరించారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కళ్లెర్రజేశారు. దోమలయ్యా.. డెంగీ వచ్చి సచ్చిపోతున్నాం.. అంటూ వాపోయారు. ఈ చంద్రబాబు దుర్మార్గుడయ్యా.. మీరు రావాలి.. మా బతుకులు మారాలి.. అని ఆకాంక్షించారు.   

ఇంటికో బాధ.. మనిషికో గాథ 
చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని జగన్‌ వద్దకు వచ్చిన ఫిర్యాదులే చెబుతున్నాయి. పౌరసేవలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు కుయుక్తి వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మున్సిపల్‌ అండ్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రమణ జగన్‌ను కలిశారు. జీవో 279ను రద్దు చేసి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్‌ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఎస్‌ విధానం వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతారని ఓ అంధ ఉపాధ్యాయుడు జననేత వద్ద మొర పెట్టుకున్నాడు. వైఎస్‌ హయాంలో విజయనగరంలో స్థాపించిన జేఎ¯న్‌టీయూకే ఒప్పంద సహాయ అధ్యాపకులను తొలగించే కుట్ర చేస్తున్నారని అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బృందం జగన్‌కు వివరించింది. పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్లు ఇవ్వడం లేదని, టీడీపీ నేతల ఆగడాలు మితిమీరాయని ఊరూరా జనం జననేతకు విన్నవించారు. అందరి కష్టాలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. 

ఈ ప్రభుత్వ మా కడుపుకొడుతోంది.. 
అన్నా.. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులుగా 17 ఏళ్లుగా సేవలందిస్తున్నాం. పదేళ్ల పాటు ఉచితంగా సేవలందించాం. ఏడేళ్లుగా నెలకు వెయ్యి రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో సకాలంలో గౌరవ వేతనం  అందడం లేదు. మెస్‌ బిల్లులు ప్రతి నెలా చెల్లించకపోవడంతో మా తాళిబొట్లు కుదువపెట్టి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. వారంలో ఆరు రోజులు గుడ్డు ఇవ్వాలని చెబుతున్నారు కానీ, మూడు రోజులకు మాత్రమే బిల్లు ఇస్తున్నారు. ఈ పథకం నిర్వహణను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోంది. అన్నా.. మీరు ముఖ్యమంత్రి కాగానే మాకు భద్రత కల్పించి నెలకు రూ.5 వేలు వేతనం ఇచ్చేలా చేయండి. 
– పెంకి లక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, విజయనగరం 

108 ఉద్యోగులను ఆదుకోండి.. 
అన్నా.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారు 108 అంబులెన్సుల వ్యవస్థను తీసుకువచ్చి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు. ఎందరో నిరుద్యోగులకు 108లో ఉద్యోగులుగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 27 అంబులెన్స్‌లు ఉండగా 134 మంది ఉద్యోగులు ఈఎంటీలు, పైలెట్లుగా పని చేస్తున్నారు. ఏడు మండలాల్లో 108 సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎనిమిది మండలాల్లో వాహనాలు మరమ్మతులకు నోచుకోక ప్రజలకు సేవలు అందడం లేదు. మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లను యాజమాన్యం సకాలంలో అందించడం లేదు. సకాలంలో డీజిల్‌ కూడా పోయించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఈ వ్యవస్థకు మీరు పూర్వవైభవం తీసుకురావాలి.                 
– ఎస్‌.బంగారురాజు, 108 ఎంప్లాయిస్‌ యూనియన్‌ విజయనగరం జిల్లా అధ్యక్షుడు 

వైఎస్సార్‌ పేరు పెట్టుకున్నందుకు కక్ష సాధిస్తున్నారు 
అన్నా.. మహానేత రాజశేఖరరెడ్డి నిరుపేదలకు 3,600 ఇళ్లు కట్టించి ఇవ్వడంతో మా కాలనీకి వైఎస్సార్‌ నగర్‌ అని పేరు పెట్టుకున్నాము. ఆయన పేరు పెట్టుకున్నందుకు టీడీపి ప్రభుత్వం మా కాలనీ ప్రజల మీద కక్ష సాధిస్తోంది. రోడ్లు నిర్మించడం లేదు. కాలువల్లో మురుగు తొలగించడం లేదు. తాగునీటి సౌకర్యం కల్పించ లేదు. చెరువులో మురుగు పేరుకుపోయి దోమలు, విష కీటకాల వల్ల జ్వరాలు ప్రబలి జనం చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు మా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. ఆశలన్నీ మీ పైనే పెట్టుకున్నాము. 
– తాలాడ గిరీష్, రాజీవ్‌నగర్‌తోట, విజయనగరం 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు