పార్లమెంట్‌లో మహాకుట్ర

19 Jul, 2018 03:02 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపాటు

ఢిల్లీ కేంద్రంగా పెద్ద డ్రామా 

చంద్రబాబు–బీజేపీ మధ్య సయోధ్య

అమిత్‌ షా–రాజగురువు భేటీ వెనుక రహస్యాన్ని బయటపెట్టాలి

విజయవాడ సిటీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమోదించడం వెనుక మహాకుట్ర జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గత పార్లమెంట్‌ సమావేశాల్లో తమ పార్టీ వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తే అనుమతించని కేంద్రం ఇప్పుడు టీడీపీ ఇచ్చిన నోటీసును ఎందుకు అనుమతించిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు–బీజేపీ మధ్య సయోధ్య కుదిరిందని, అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఆమోదం తెలిపారని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు బుధవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఇచ్చిన నోటీసుకు అనుమతి తెలపడం పార్లమెంట్‌ సమావేశాల్లో కొత్త ట్విస్ట్‌ అని చెప్పారు. తమ పార్టీ వరుసగా 13 సార్లు నోటీసులు ఇస్తే ఎందుకు చర్చ జరపలేదని ప్రశ్నించారు. అప్పుడెందుకు హెడ్‌ కౌంట్‌ చేయలేదని నిలదీశారు. 

అవిశ్వాస తీర్మానంపై బాబు ప్రగల్భాలు 
‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు? వాటి వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాలి. టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిరింది. బుధవారం పార్లమెంట్‌లో చోటుచేసుకున్న సన్నివేశమే అందుకు ఉదాహరణ. పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలపై ఎన్డీఏ సమాధానం చెప్పాలి. దేశం తలదించుకొనేలా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారా? ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్‌ వేదికగా పెద్ద డ్రామా ప్రదర్శించాలని టీడీపీ బుధవారం ఓ ప్రణాళిక రూపొందించుకుంది.

గతంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ సాక్షిగా ఎన్ని డ్రామాలు ఆడారో ప్రజలంతా చూశారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నారో అందరికీ తెలుసు. కేంద్రంపై మొట్టమొదట అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముందుకొచ్చింది వైఎస్సార్‌సీపీనే. అవిశ్వాస తీర్మానంపై మొదట్లో చంద్రబాబు హేళనగా మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం పెడితే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందా అన్నారు. ఆ తరువాత యూటర్న్‌ తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నానని ప్రగల్భాలు పలుకుతున్నారు’’ అని అంబటి నిప్పులు చెరిగారు. 

చంద్రబాబుది దిగజారుడుతనం 
‘‘పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును మొదటి రోజే స్పీకర్‌ ఆమోదించడంలో ఆంతర్యం ఏమిటి? ఇది కుట్రలో భాగమేనన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎంపీ బుట్టా రేణుకను వైఎస్సార్‌సీపీ నుంచి చంద్రబాబు కొనుగోలు చేస్తే.. ఆమెను మా పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా కేంద్రం గుర్తించడం దారుణం. చంద్రబాబుకు రాజగురువు అయిన ఓ పత్రాకాధిపతితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రహస్యంగా సమావేశమైన తర్వాతే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్‌ అనుమతించడంపై అనుమానాలు ఉన్నాయి.

చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే. ఆయన తనకు మద్దతు ఇచ్చిన పార్టీలను పుటుక్కున ముంచేస్తాడు. నరేంద్ర మోదీ–చంద్రబాబు జోడి కలిసి రాష్ట్రాన్ని ఇప్పటికే సర్వనాశనం చేశారు. మళ్లీ కలిసి మరింత నాశనం చేస్తారు. చంద్రబాబు అటు కాంగ్రెస్‌తోనైనా, ఇటు బీజేపీతోనైనా కలుస్తానంటున్నారు. రకరకాల బేరసారాలు సాగిస్తూ ప్రజలను మోసం చేయగల దిగజారుడుతనం చంద్రబాబుది’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ‘‘ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే.. టీడీపీ నేతలు దానిపై తప్పుడు ప్రచారం సాగిస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడైనా తిరుమల కొండపై స్వామివారి ఆలయాన్ని  మూసివేశారా? శ్రీవారితో పెట్టుకుంటే అనుభవించక తప్పదు’’ అని అంబటి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు