గోదారమ్మ చెంత అభిమాన పరవళ్లు

29 May, 2018 02:08 IST|Sakshi
వీరవాసరంలో వైఎస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్న ఏపీసీపీఎస్‌ ఉద్యోగ సంఘం నేతలు

దండు కట్టిన జనం.. దారిపొడవునా వెల్లువెత్తిన సంఘీభావం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారమ్మ చెంత జన ప్రవాహం పరవళ్లు తొక్కింది.. అభిమాన కెరటం ఉవ్వెత్తున ఎగిసింది.. ఊరూ వాడా ఏకమై కదిలి వచ్చి జననేత ప్రజా సంకల్ప యాత్రకు మద్దతు పలికింది. భగభగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయని జనం తమ అభిమాన నేతను చూసేందుకు పాదయాత్ర సాగిన మార్గంలో బారులు తీరారు. ప్రజా సంకల్ప యాత్ర 174వ రోజు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పూర్తి చేసుకుని ఉండి నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. విస్సాకోడేరు, గోరంగనముడి, పెన్నాడ, శృంగవృక్షం, నాదమూరు గరువు మీదుగా సాగింది. ప్రతి గ్రామంలోనూ జన ప్రవాహమే కనిపించింది.

సమస్యలు చెప్పేవాళ్లు కొందరు.. అంతులేని అభిమానంతో వచ్చే వాళ్లు ఇంకొందరు.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగేవాళ్లు మరికొందరు.. వీరంతా జగనొస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, ఆ రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. గోదావరి సాక్షిగా జగన్‌ వెంట నడుస్తామంటున్నారు. ఉప్పొంగే జన హృదయాలతో మమేకమవుతూ, అవ్వతాతలకు ఆప్యాయత పంచుతూ, అక్క చెల్లెమ్మలను మనసారా పలకరిస్తూ.. యువజనాన్ని ఉత్సహభరితులను చేస్తూ జననేత ముందుకు సాగారు.  

మరపురాని ఘట్టాలు... మరచిపోని చిత్రాలు 
పాదయాత్రలో సామాజిక మాథ్యమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌ను కలిసేందుకు వచ్చే చాలా మంది సెల్ఫీలు దిగుతున్నారు. వాటిని వెంటనే ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాట్సాప్‌లో సన్నిహితులకు పంపుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొంతమంది కుటుంబ సభ్యులకు పాదయాత్రను లైవ్‌ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విస్సాకోడేరులో లీలావతి అనే గృహిణి ఇదే పని చేసింది. ‘ఇంట్లో మా అత్త, మామగారున్నారు. జగన్‌ను చూడాలన్నది వాళ్ల కోరిక. కానీ ఈ జనంలోకి రాలేకపోతున్నారు. హైదరాబాద్‌లో మా అమ్మ, నాన్న ఉన్నారు.

విజయవాడలో మా వారు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్లందరికీ మా ఊళ్లో జగన్‌ పాదయాత్రను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాను’ అని ఆమె ఫేస్‌బుక్‌ను చూపిస్తూ చెప్పింది. శృంగవృక్షం దగ్గర మరో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. జగన్‌ కోసం ఎదురు చూస్తున్న కొంతమంది ఫేస్‌బుక్‌కు కనెక్ట్‌ అయ్యారు. పాదయాత్రను దగ్గరుండి లైవ్‌ ఇస్తున్న వారి అకౌంట్‌ను పరిశీలిస్తున్నారు. జగన్‌ ఎక్కడికొచ్చారు.. ఎంత దూరంలో ఉన్నారనే సమాచారాన్ని ఇళ్లలో ఉన్న వారికి చేరవేస్తున్నారు. ఆ ఊర్లోకి జగన్‌ అడుగు పెట్టగానే పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వచ్చారు.  

అంతులేని అభిమానం... 
‘దేవుడిని అడిగేశాను. జగన్‌ను సీఎం చేస్తానన్నాడు. ఇక తిరుగేలేదు’ అని లక్ష్మిదేవమ్మ అనే మహిళ కొండంత విశ్వాసంతో చెప్పింది. జగన్‌ను కలిసిన ఆ క్షణంలో ఆమె ఎన్నో చెప్పింది. మనసులో దాచుకున్న అభిమానం బయటకు తీసింది. వైఎస్‌ పాలన చూసిందట. ఎంతో ఆనందంగా ఉండేదట. మళ్లీ జగన్‌ వస్తేనే ఆ ఆనందం అంది. ‘అన్న నేనిచ్చిన కొబ్బరి నీళ్లు తాగాడు. ఇంతకన్నా నాకేం కావాలి’ అని గొరగనమూడిలో ఓ మహిళ సంబరపడింది. ‘అన్న నా చేతిలో చెయ్యేశాడు. నేనున్నానన్నాడు’ అని బదిర లక్ష్మి జగన్‌ను కలిసిన తర్వాత ఆనందం పంచుకుంది.

ఊళ్లో బెల్ట్‌ షాపుందట. ఇబ్బందిగా ఉందని చెప్పిందట. దాన్ని తీయిస్తానని భరోసా ఇచ్చాడట. ఆ నమ్మకం చాలంది ఆమె. ‘జగనన్న వస్తున్నారని ఊళ్లోని మహిళలందరికీ కుంకుమ పెట్టి మరీ చెప్పాను.. ఇదో అందరూ వచ్చారు’ అని కుంకుమ భరిణి చూపిస్తూ శృతి సంతోషపడింది. బీటెక్‌ చదివాను. ఉద్యోగం లేదని చెప్పాను. ఇంకో ఏడాది ఓపిక పట్టమన్నాడు జగనన్న. మాకు నమ్మకముందంటూ పెన్నాడ దగ్గర జగన్‌ను కలిసిన విశేష్, సత్యప్రకాశ్, మల్లేశ్వర్‌ అన్నారు.  

ఈ ప్రభుత్వాన్ని భరించలేమన్నా.. 
దారిపొడవునా వివిధ వర్గాల వారు జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. టెట్‌ ఉత్తీర్ణులైనా అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ సౌజన్య ఆగ్రహంతో చెప్పింది. ‘అనాథనయ్యా.. కొడుక్కు దారి చూప’మంటూ చినరంగనిపాలెం వద్ద యల్లమ్మ వేడుకుంది. మా ఉద్యోగాలు పర్మినెంట్‌ కావా? అంటూ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు విస్సాకోడేరు వద్ద బావురుమన్నారు. మంచినీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదని పెన్నాడ వద్ద ప్రజలు చెప్పుకున్నారు. చంద్రబాబు సర్కారు బెల్ట్‌షాపులు పెట్టి ఎలా కష్టపెడుతుందో ఇదే గ్రామంలో మంకు వెంకట సత్యవతి, తులసీ మరికొందరు మహిళలు చెప్పారు. అందరి సమస్యలను జగన్‌ ఓపికగా విన్నారు. మన ప్రభుత్వం రాగానే అందరి సమస్యలు తీరుతాయని ధైర్యం చెప్పారు.   

ఆయనే మా లీడర్‌ 
‘జగనే నిజమైన లీడర్‌ ’. ఫేస్‌బుక్‌ పేజీలో జనంతో జగన్‌ మమేకమైన పోస్టింగ్‌ లైక్స్‌ వైపు చూస్తూ శృంగవృక్షం వద్ద ఆనంద్‌ అనే వ్యక్తి అన్నమాటిది. డేటా ఎనలిస్ట్‌గా పనిచేస్తున్న అతను జగన్‌ పాదయాత్ర కోసం సొంతూరొచ్చాడు. దాదాపు 50 మంది ఫ్రెండ్స్‌తో కలిసి ఫేస్‌బుక్‌ చూస్తున్న అతను ఎన్నో విషయాలు చెప్పాడు. ఒక పక్క పాదయాత్ర జరగుతోందని, మరో పక్క చంద్రబాబు మహానాడు నిర్వహిస్తున్నారని, ఈ రెండిండిపైనా సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లు చూశానని చెప్పాడు. మహానాడు కన్నా.. జగన్‌ పాదయాత్రను చాలా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారని, లైక్‌లు, షేరింగ్‌లు రెట్టింపు ఉన్నాయని విశ్లేషించాడు. దీన్నిబట్టి జనం ఎవరిని కోరుకుంటున్నారో ఇట్టే తెలుస్తోందన్నారు.    

మరిన్ని వార్తలు