తాజా సర్వే... మోదీకి భారీ షాక్‌

24 Jan, 2019 19:44 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’లో తేలింది. ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏకు 99 సీట్లు తగ్గే అవకాశముందని సర్వే అంచనా వేసింది. 237 సీట్లు మాత్రమే గెలిచే అవకాశముందని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే యూపీఏ కూటమి భారీగా పుంజుకోనుంది. యూపీఏ 166 సీట్లు దక్కించుకునే అవకాశముంది. 2014తో పోలిస్తే యూపీఏకు అదనంగా 106 సీట్లు జతకానున్నయి. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కాని పార్టీలు 140 స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే తేల్చింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏకు 35 శాతం, యూపీఏకు 33 శాతం ఓట్లు పడతాయని అంచనా. (ఏపీలో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం)

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా సర్వే ఫలితాలు కమలనాథులను కలవరపెడుతున్నాయి. రెండోసారి అధికారం దక్కించుకోవాలన్న మోదీ-షా ద్వయానికి ఈ అంచనాలు షాక్‌ ఇచ్చాయి. అయితే ఎన్డీఏ, యూపీఏతో జట్టు కట్టే పార్టీల ఆధారంగా ఫలితాలు మారే అవకాశముంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 272. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కానీ పార్టీలు దేనికి మద్దతు ఇస్తే ఆ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందని సర్వే ద్వారా స్పష్టమైంది.

మరిన్ని వార్తలు