టీఆర్‌ఎస్‌కు మద్దతుపై సీపీఐ క్లారిటీ

14 Oct, 2019 20:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది రేపు (మంగళవారం) హుజూర్‌నగర్‌లో జరిగే కార్యకర్తల సమావేశంలో వెల్లడిస్తామని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఒంటరి వారు కాదని, వారి సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యలు సరిష్కారమవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

సీపీఐ విఙ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు..
‘తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల్లో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సీపీఐ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని గతంలో నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, డిమాండ్లపై గత పది రోజులుగా చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా, అన్యాయంగా ఉంది. సమ్మె కార్మికుల చట్టబద్దమైన హక్కు, దానిని నిరాకరించడం కార్మికవర్గ వ్యతిరేక వైఖరి. పైగా వారితో చర్చించేందుకు నిరాకరిస్తూ.. దాదాపు 48 వేల మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రైవేటికరణ చేయడానికి పూనుకుంది.
(చదవండి : డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత)

సమ్మె విచ్ఛిన్నానికి పూనుకుని ప్రభుత్వం విఫలమైంది. కొత్త రిక్రూట్‌మెంట్‌ ప్రకటించి నిరుద్యోగ యువకులను మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. ఈవైఖరి మార్చుకొమ్మని సీపీఐ చేసిన విఙ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికులు ఆత్మాహుతి చేసుకుంటున్నారు. మానసిక వ్యధతో మరికొంతమంది గుండెపోటుతో మరణించారు. పరిష్కారం బదులు ప్రభుత్వం మరింత విద్వేషపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సీపీఐ కార్మికవర్గ పార్టీగా, శ్రామికవర్గ పార్టీగా స్పందించింది. హూజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరిస్తోంది’అన్నారు.

మరిన్ని వార్తలు